భద్రాచలం, జూన్ 19 : ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ గిరిజనులకు రక్త పరీక్షలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. సికిల్ సెల్ ఎనీమియా దినోత్సవం సందర్భంగా భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన భవనంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఐటీడీఏ పీవో రాహుల్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన గూడేల్లో పిల్లలకు ఎక్కువగా సికిల్ సెల్ ఎనీమియా వ్యాప్తి చెందుతుందని, ఇది పిల్లల నుంచి పెద్దల వరకు విస్తరిస్తుందని, దీనిని మొదట్లోనే గుర్తించి సరైన వైద్య పరీక్షలు చేయించుకుంటే నివారించవచ్చన్నారు. అన్ని పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ముఖ్యమైన కూడళ్లలో క్యాంపులు ఏర్పాటు చేసి ప్రతీ ఒక్కరికి సికిల్ సెల్ ఎనీమియా టెస్టులు చేయించాలన్నారు.
అనంతరం ఎమ్మెల్యే వెంకట్రావు, పీవో రాహుల్ మాట్లాడుతూ 130 పంచాయతీల్లో క్యాంపులు నిర్వహించి ప్రతీ ఒక్కరికి పరీక్షలు చేయించేందుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఏజెన్సీలోని గిరిజన గ్రామాలు, గూడేల్లో ప్రతీ ఒక్కరు రక్త పరీక్షలు చేయించుకునేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో ఎల్.భాస్కర్‌నాయక్, ఏసీఎంవో రమణయ్య, డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయలక్ష్మి, ఏడీఎంహెచ్‌వో చైతన్య, సికిల్ సెల్ ప్రోగ్రాం ఆఫీసర్ మధుకర్, ఆర్ఎంవో రాజశేఖర్, ఇతర శాఖల అధికారులు, నర్సింగ్ కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు.