టేకులపల్లి, జూలై 8: తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందేందుకు రైతులు మునగ సాగుపై దృష్టి పెట్టాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. మంగళవారం టేకులపల్లి మండలంలోని రాంపురం పంచాయతీ పాతతండా గ్రామ సమీపంలో సాగు చేస్తున్న మునగ తోటను పరిశీలించి రైతు గాంధీని అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మునగ ఆకు, కాయలు, ఎండిన విత్తనాల ద్వారా సైతం ఆదాయం వస్తుందని తెలిపారు.
రైతులు బయో చారుకొల్ తయారు చేసుకోవాలని, చేనులో అందుబాటులో ఉన్న కర్రలను పొలం చివరలో ఒక గొయ్యిలాగా తీసి దానిలో కాల్చి వచ్చిన బొగ్గులను ఆవు మూత్రం కలిపి దానిని ఎరువుల ఉపయోగించుకోవాలన్నారు. దీంతో ఎరువుల వినియోగం కూడా తగ్గుతుందని సూచించారు.
గ్రామాల్లో ప్రతి ఇంట్లో ఇంకుడుగుంతలను ఏర్పాటు చేసుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. కూరగాయల సాగుపై రైతులు మొగ్గుచూపాలని, ప్రతిఒక్కరూ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఇన్సూరెన్స్ పాలసీ చేపించుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్కు గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. టేకులపల్లి ఎంపీడీవో బీ మల్లేశ్వరి, తహసీల్దార్ వీరభద్రం, ఏవో అన్నపూర్ణ, ఎంపీవో గణేష్గాంధీ, కాళంగి శ్రీనివాస్, ఏపీవో రవికుమార్, ఈసీ తిరుపతయ్య, కార్యదర్శి రాజశేఖర్, రైతులు పాల్గొన్నారు.