భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి కృషి చేయాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. మహిళా, శిశు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్య పథకం కింద బాలల దినోత్సవం వేడుకలను ఐడీవోసీలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారులను ఎంతగానో ప్రేమించే జవహర్లాల్ నెహ్రూ జ్ఞాపకార్థం ప్రతీ సంవత్సరం బాలల దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు.
అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ఐటీడీఏ మనోవికాస్ పాఠశాల దివ్యాంగ విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తర్వాత వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. అలాగే బీఎస్సీ నర్సింగ్ చేయడానికి విద్యార్థిని కుసుమ కుమారికి ఎన్ఆర్ఐ తోటకూర రమేశ్ అందించిన రూ.లక్షను కలెక్టర్ ద్వారా అందజేశారు. అనంతరం ది ఇన్నర్ వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విద్యాచందన, మహిళా, శిశు సంక్షేమాధికారి లెనీనా, సీడబ్ల్యూసీ చైర్మన్ భారతరాణి, సుమిత్రాదేవి, సాధిక్ పాషా, అంబేద్కర్, విద్యార్థులు పాల్గొన్నారు.