భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశించారు. కుటుంబ సర్వే డేటా ఎంట్రీ, డబుల్ బెడ్రూం ఇల్లు, ఇంటిగ్రేటెడ్ పాఠశాలల స్థల గుర్తింపు తదితర అంశాలపై అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందనతో కలిసి కలెక్టరేట్ నుంచి ఆర్డీవోలు, జిల్లా అధికారులతో గురువారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. సర్వే డేటా ఎంట్రీ కోసం ఆసక్తి ఉన్న, ఉత్సాహవంతులైన యువతీ యువకులను నియమించుకోవాలని సూచచించారు.
తహసీల్దార్లు తమ పరిధిలోని పాఠశాలలు, కాలేజీల్లోని కంప్యూటర్ ల్యాబ్లను వినియోగించుకోవాలని సూచించారు. కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, కరకగూడెం, చర్ల మండలాల్లో డేటా ఎంట్రీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. చండ్రుగొండ, ములకలపల్లి, ఇల్లెందు మండలాల్లో భూ సమస్యలపై దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. తహసీల్దార్లు తమ పరిధిలోని సమస్యలు పరిష్కరించి నివేదికలు అందించాలన్నారు. పోడు పట్టాలు మంజూరై పాస్ బుక్కులు పొందని గిరిజన రైతులను ఐటీడీఏ అధికారుల సమన్వయంతో గుర్తించి జిల్లా అటవీ శాఖ అధికారి సూచనలతో పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయించాలని సూచించారు.