భద్రాచలం, జనవరి 6 : ముక్కోటి ఏకాదశి ఏర్పాట్ల పనుల్లో వేగం పెంచాలని, మంగళవారం నాటికి పనులన్నీ పూర్తి కావాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. తొలుత భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్.. ముక్కోటి పనులు ఎంతవరకు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు.
భక్తులు అధిక సంఖ్యలో భద్రాద్రికి తరలివచ్చే అవకాశం ఉండడంతో పనుల్లో అలసత్వం వద్దని, తమకు అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వైద్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఆలయ పరిసరాలు, పట్టణంలో స్వచ్ఛత పాటించాలని పంచాయతీ అధికారులకు సూచించారు. ఈ నెల 9, 10 తేదీల్లో పట్టణంలోని మాంసం, మద్యం దుకాణాలు పూర్తిగా బంద్ చేయించాలని ఎక్సైజ్, పోలీసు శాఖలను ఆదేశించారు. ముక్కోటి సందర్భంగా రామాలయానికి వచ్చే భక్తులతోపాటు గోదావరి, కరకట్ట ప్రాంతాల్లో ఈ ఏడాది గిరిజన సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే విధంగా రివర్ ఫెస్టివల్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
గిరిజనుల వంటకాలు, కళాఖండాలు, ఔషధ గుణాలు కలిగిన ఆహార పదార్థాల అమ్మకాల కోసం స్టాళ్లు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుడిసెల్లో పర్యాటకులు బస చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. అనంతరం ఎస్పీ రోహిత్‌రాజు, డీఆర్డీవో విద్యాచందన, ఆలయ ఈవో రమాదేవి, ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్‌లతో కలిసి ఆలయ పరిసరాలు, గోదావరి వద్ద ముక్కోటి ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ వెంకటేశ్వర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.