కొత్తగూడెం ఎడ్యుకేషన్, నవంబర్ 25 : జిల్లా, మండల స్థాయి అధికారులు తమ పరిధిలోని సంక్షేమ వసతి గృహాలను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశించారు. సోమవారం జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతగా అందించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలపై అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ మణెమ్మతో కలిసి జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, సంబంధిత అధికారులతో కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హాస్టళ్లను వ్యక్తిగతంగా వెళ్లి పరిశీలించి అక్కడ నెలకొన్న పరిస్థితులు, సమస్యలపై ఫొటోలతో కూడిన నివేదిక అందించాలన్నారు. విద్యార్థులు తమ ప్లేట్లను శుభ్రం చేసుకోకుండా.. వర్కర్లు శుభ్రం చేసి ప్లేట్లు భద్రపరిచే విధంగా సౌకర్యాలు కల్పించాలన్నారు. హాస్టళ్లు, పాఠశాలల్లో పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందించే బాధ్యత పాఠశాల హెచ్ఎంలు, ప్రిన్సిపాళ్లు, హాస్టల్ వార్డెన్లదేనని అన్నారు. మంగళవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఉదయం 11 గంటలకు అధికారులందరూ ప్రతిజ్ఞ చేయాలని సూచించారు.