భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ‘రక్త పరీక్షలు చేయమంటే బయటకు వెళ్లమని చెబుతారు. ఏ మందులు ఆస్పత్రిలో లేవు.. బయటకు వెళ్లి తెచ్చుకోవాలంటారు. పిల్లలకు వేసే చుక్కల మందు కూడా బయటే తీసుకు రావాలంటారు. కనీసం ఎక్స్‌రే కూడా లేదని చెబుతారా?’ అంటూ కలెక్టర్ జితేశ్ వి పాటిల్.. రామవరం మాతా, శిశు ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లా కేంద్రంలోని రామవరం మాతా, శిశు ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్‌కు పలువురు రోగులు ఆసుపత్రి సిబ్బంది పనితీరు, నిర్లక్ష్యంపై నేరుగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ‘మీకు వారం టైం ఇస్తున్నా. అన్నీ సెట్ అవ్వకపోతే ఎవర్నీ వదలా. మీ మీద ఒక సూపర్వైజర్ను పెడతా’ అని హెచ్చరించారు.
నిరుపేద రోగులు ఆస్పత్రికి వస్తే.. బయట రక్త పరీక్షలు చేయించుకోవాలని రాస్తారా.. ఆ డాక్టర్‌కు షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఆదేశించారు. అందర్నీ సస్పెండ్ చేసుకుంటూ పోతే ఇక ఆసుపత్రి ఉండదని చూస్తున్నా, ఇక ఉపేక్షించేది లేదు. పై అధికారి నుంచి కిందిస్థాయి వరకు ప్రక్షాళన చేస్తానన్నారు. ఆసుపత్రిలో మందులు లేకపోతే ఇండెంట్ పెట్టి తెప్పించుకోవాలన్నారు. నువ్వు ఏమన్నా డీఎంఈవా లేక హైదరాబాద్‌లో ఉంటున్నావా.. మందులు కూడా చెక్ చేసుకోలేకపోతున్నావా.. అని సూపరింటెండెంట్‌పై సీరియస్ అయ్యారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్‌వో డాక్టర్ భాస్కర్‌నాయక్, డీసీహెచ్ఎస్ రవిబాబు తదితరులు ఉన్నారు.