భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : టీజీపీఎస్సీ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో ఈ నెల 9న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశామని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల ఒక ప్రకటనలో తెలిపారు. మొదటిసారిగా బయోమెట్రిక్ పద్ధతిన పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
మొత్తం 8,875 మంది పరీక్షకు హాజరు కానున్నారని, ఇందుకోసం 21 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 9న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. ఉదయం 10 గంటలకే గేట్లు మూసివేస్తారని, సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను కేంద్రంలోకి అనుమతించేది లేదని, నిమిషం నిబంధన కచ్చితంగా అమలులో ఉంటుందని, అభ్యర్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ సూచించారు.