తిరుమలాయపాలెం, జూన్ 19 : ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్య సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వర్తించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. తిరుమలాయపాలెం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం(సీహెచ్సీ)ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా సందర్శించి, తనిఖీ చేశారు. క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ వార్డు, ల్యాబ్, కాన్పుల ఆపరేషన్ థియేటర్ను పరిశీలించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు. ఆసుపత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలి చెప్పారు.
రోగులతో మర్యాదగా వ్యవహరిస్తూ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న 100 పడకల ఏరియా ఆసుపత్రి పనులను పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు. తర్వాత తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ప్రజా దర్బార్లో వచ్చిన దరఖాస్తులు, కాకరవాయిలో జరుగుతున్న డిజిటల్ భూ సర్వేపై సమీక్ష నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో డీసీహెచ్ఎస్ రాజశేఖర్ గౌడ్, ఆసుపత్రి ఇన్చార్జి డాక్టర్ కృప ఉషశ్రీ, వైద్య నిర్మాణ శాఖ ఈఈ ఉమామహేశ్వరావు, ఎంపీడీవో షేక్ శిలార్ సాహెబ్, తహసీల్దార్ లూథర్ విల్సన్ ఉన్నారు.