రఘునాథపాలెం, నవంబర్ 27: గ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికల కోసం అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అధికారులు, సిబ్బంది పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని, ఎన్నికల విధులపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని సూచించారు. రఘునాథపాలెంలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. ఎన్నికల విధులు, బాధ్యతల నిర్వహణపై సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఏడు మండలాల్లో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో 192 సర్పంచ్, 1,740 వార్డు సభ్యుల స్థానాలకు గురువారం నుంచి ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్ కేంద్రాల్లో రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. మొదటి విడత ఎన్నికల కోసం 3 వేల సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు ఎన్నికల నిర్వహణలో సంపూర్ణ మద్దతును ఎన్నికల సిబ్బందికి అందించాలన్నారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా సుమారు 8 వేల మంది అధికారులు, సిబ్బంది, పోలీసులను నియమించినట్లు తెలిపారు. నామినేషన్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఎలాంటి ర్యాలీలు, ప్రచారాలకు అనుమతి లేదని, ఎన్నికల ప్రచార నిమిత్తం ర్యాలీ, సమావేశాల కోసం ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు అక్రమంగా నగదు, మద్యం తరలిస్తే పట్టుకుని సీజ్ చేస్తామని చెప్పారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్వేత తదితరులు ఉన్నారు.