మామిళ్లగూడెం, జూన్ 23 : సీజనల్ వ్యాధుల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, శ్రీనివాసరెడ్డితో కలిసి అధికారులతో సమీక్షించారు. గత ఏడాది సీజనల్ వ్యాధుల పట్ల తీసుకున్న చర్యల గురించి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కళావతిబాయి కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వానకాలంలో వ్యాధులు అధికంగా గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో వచ్చే అవకాశం ఉందని, వాటి నియంత్రణకు ప్రణాళిక చేయాలని తెలిపారు.
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించే విధంగా అవగాహన కల్పించాలని, ప్రతి పీహెచ్సీ, సబ్సెంటర్లలో అవసరానికి మించి 10 శాతం బఫర్స్టాక్ ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. గురుకులాలు, సంక్షేమ వసతిగృహాలు, ప్రభుత్వ పాఠశాలలో ప్రతిరోజు ఉదయం పిల్లలకు వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు.
గత ఏడాది అధిక కేసులు నమోదైన ప్రాంతాలను హాట్స్పాట్లుగా ఎంపిక చేసి అక్కడ ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలన్నారు. లక్షణాలు ఉన్న ప్రతిఒక్కరికి పరీక్షలు చేయాలని, జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమీక్షలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ మాటాడుతూ హాస్టల్లో ఫుడ్ కమిటీలు వేయాలని, పారిశుధ్య పనులు వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో పద్మశ్రీ, డీఆర్డీవో సన్యాసయ్య, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.