భద్రాచలం, మార్చి 23: శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కల్యాణం, పట్టాభిషేకం మహోత్సవానికి సంబంధించిన విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని, విధి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది లేదని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ సంబంధిత శాఖల అధికారులను హెచ్చరించారు. భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం, పట్టాభిషేకం మహోత్సవం జరిగే మిథిలా స్టేడియంలో వివిధ సెక్టార్లకు విధులు కేటాయించబడిన లైజన్ ఆఫీసర్లు, సెక్టోరియల్ ఆఫీసర్లు, వివిధ శాఖల అధికారులతో సోమవారం ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ 26వ తేదీ ఉదయం 9 గంటల వరకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో రిపోర్టు చేసి, మీకు కేటాయించిన సెక్టార్లను పరిశీలించుకొని సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా భక్తులు, వీఐపీలు, వీవీఐపీలు బసచేసే అతిథి గృహాలకు నియమించబడిన సెక్టార్ ఆఫీసర్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నీ సక్రమంగా ఉన్నదీ లేనిదీ ముందుగానే చూసుకోవాలన్నారు. కల్యాణానికి వచ్చే ప్రముఖులతోపాటు భక్తులు క్రమ పద్ధతిలో కూర్చునే విధంగా చూడాలని సూచించారు. ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో బి.రాహుల్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, శిక్షణ కలెక్టర్ సౌరబ్ శర్మ, ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, డీఆర్డీవో విద్యాచందన, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.