భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : పెట్రో ఉత్పత్తులను బ్లాక్ మార్కెటింగ్ చేసినా, అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అంకిత్ హెచ్చరించారు. భద్రాద్రి ఐడీవోసీ సమావేశ మందిరంలో పెట్రో, గ్యాస్ ఉత్పత్తుల డిస్ట్రిబ్యూటర్లతో కలెక్టర్ గురువారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుతానికి తలెత్తుతున్న పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ లభ్యత గురించి బంకుల యజమానులు, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లతో ప్రత్యేకంగా చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెట్రోల్ బంకుల నిర్వాహకులు అన్ని వేళలా అందుబాటులో ఉండి.. డీజిల్, పెట్రోల్, ఎల్పీజీ సకాలంలో అందించాలని, చమురు కంపెనీల నుంచి ఉత్పత్తులు సకాలంలో ఇండెంట్ పెట్టి ముందస్తుగా పెట్రోల్, డీజిల్ బంకులలో సమృద్ధిగా ఉంచుకోవాలని సూచించారు. అయితే.. బీపీసీఎల్, ఐవోసీఎల్ సేల్స్ ఆఫీసర్లు సమావేశానికి హాజరుకాగా.. హెచ్పీఎస్ఎల్ సేల్స్ ఆఫీసర్ సమావేశానికి రాకపోవడంతో సరైన వివరాలు తెలియలేదని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.