భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ఐడీవోసీ కార్యాలయంలో నిర్వహిస్తున్న మహిళా శక్తి క్యాంటీన్‌ను కలెక్టర్ అంకిత్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్యాంటీన్లో అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలను పరిశీలించి, సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. కార్యాలయానికి వచ్చే ఉద్యోగులు, ప్రజలకు నాణ్యమైన, శుభ్రమైన ఆహారం అందించాలని ఆదేశించారు. ముఖ్యంగా సిరిధాన్యాలతో(మిల్లెట్స్) తయారు చేసిన ఇడ్లీ, దోశ తదితర ఆరోగ్యకరమైన వంటకాలను క్యాంటీన్లో అందుబాటులోకి తేవాలని సూచించారు.
క్యాంటీన్ నిర్వహణ విధానంపై వివరాలు సేకరించి ఎన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారో తెలుసుకున్నారు. క్యాంటీన్లో నాణ్యమైన, తాజా ఆహార పదార్థాలనే విక్రయించాలని, శుభ్రత, ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారి స్వర్ణలత లెనీనా ఉన్నారు.