దమ్మపేట, ఆగస్టు 20: ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో మెనూ పాటించడంతోపాటు విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. మందలపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, కళాశాల, గండుగులపల్లి మోడల్ సోలార్ గ్రామం, పట్వారిగూడెం పీహెచ్‌సీలను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకుల పాఠశాల, కళాశాలలో భోజన వసతి, మెనూ అమలు తీరును పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం గురువారం భోజనం, క్యాబేజీ, టమాటా పప్పు, నెయ్యి, రసం, కోడిగుడ్డు-టమాటో, పెరుగు అందించాల్సి ఉండగా.. క్యాబేజీ కూర వండకపోవడం, పెరుగుకు బదులు మజ్జిగ ఇవ్వడాన్ని కలెక్టర్ తప్పుపట్టారు.
దీనిపై సిబ్బందిని ప్రశ్నిస్తూ.. బాధ్యులైన ప్రిన్సిపాల్, వార్డెన్‌పై అసహనం వ్యక్తం చేశారు. డైనింగ్ హాల్లో పూర్తిస్థాయిలో లైట్లు వెలగడం లేదని, పాఠశాల చుట్టూ పిచ్చిమొక్కలను చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇద్దరికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పట్వారిగూడెం పీహెచ్‌సీని తనిఖీ చేసిన కలెక్టర్.. ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ రోగుల వివరాలు, వైద్యులు, సిబ్బంది హాజరు తదితర అంశాలపై ఆరా తీశారు. రికార్డులు, రక్త పరీక్షల విభాగాన్ని పరిశీలించిన కలెక్టర్.. అనాలసిస్ యంత్రం పని చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.3 లక్షల విలువైన పరికరం ఏడాదికాలంగా పని చేయకపోయినా ఎందుకు మరమ్మతు చేయించలేదని మండిపడ్డారు. అనంతరం గండుగులపల్లిలో మోడల్ సోలార్ పనులను కలెక్టర్ పరిశీలించారు.
గ్రామాభివృద్ధిలో భాగంగా లబ్ధిదారుల ఇళ్లలో ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్యానెళ్లను పరిశీలించి.. యూనిట్ల ఏర్పాటు, పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో 424 మంది గృహజ్యోతి లబ్ధిదారులకు సోలార్ యూనిట్లు ఏర్పాటు చేయనుండగా.. ఇందులో స్లాబ్ ఉన్న 250 ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 242 ఇళ్లలో యూనిట్ల ఏర్పాటు పూర్తయినట్లు పేర్కొన్నారు. కలెక్టర్ వెంట శిక్షణ డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ మద్దినేని మురళి, ఎంపీడీవో రవీందర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.