కూసుమంచి, సెప్టెంబర్ 2: భారీ వర్షాలతో జరిగిన నష్టంపై అంచనాలు రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే అన్ని శాఖల అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాణనష్టం జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాలు, వరదల ప్రభావం పాలేరు నియోజకవర్గంలో అధికంగా ఉన్నందున సోమవారం జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి.. మండలంలోని పలు ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.
సాగర్ ఎడమ కాలువ రెండో జోన్ సమీపంలో హట్యాతండా వద్ద పడిన గండిని పరిశీలించారు. వరద పరిస్థితి, కాలువ గండి వివరాలను సీఈ విద్యాసాగర్‌ను అడిగి తెలుసుకున్నారు. సూర్యాపేట – ఖమ్మం హైవేపై ఆదివారం రాకపోకలు బంద్ అయిన ప్రదేశాన్ని, అక్కడే కూలిన బ్రిడ్జిని సీఎం పరిశీలించారు. వీటి గురించి ఎన్హెచ్ఏఐ అధికారులతో చర్చించారు.
అనంతరం పాలేరు ప్రధాన కాలువ వద్దకు చేరుకొని గండి పడిన ప్రదేశాన్ని పరిశీలించారు. నష్ట తీవ్రత గురించి సీఈని అడిగి తెలుసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ రఘురాంరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, సీపీ సునీల్‌దత్ తదితరులు పాల్గొన్నారు. ఏసీపీ తిరుపతిరెడ్డి ఆధ్వర్యలో సీఐలు సంజీవ్, మురళి, ఎస్సై నాగరాజు బందోబస్తు నిర్వహించారు.