ఖమ్మం, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న సీతారామ ప్రాజెక్టును 2026, ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తామని, సాగునీరు అందించి రైతులకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గురువారం ఖమ్మం జిల్లా వైరాలో రూ.2 లక్షల రుణమాఫీని ప్రారంభించిన సీఎం.. తరువాత జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు.
రూ.2 లక్షల రైతుల రుణమాఫీకి సంబంధించి రూ.18 వేల కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు. ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ వరంగల్‌లో రైతు డిక్లరేషన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ఆ ప్రకారమే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసిందని వివరించారు. ఇప్పటికే రెండు విడతలుగా రుణమాఫీ చేసిన తమ ప్రభుత్వం మూడో విడతగా రూ.2 లక్షలలోపు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ చేసిందని వివరించారు.
మొత్తం రూ.18 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. కేవలం 27 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో రుణమాఫీ నగదు జమ చేయడం దేశంలోనే రికార్డు అని అన్నారు. తమ ప్రభుత్వం దళితులు, గిరిజనుల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తోందన్నారు. త్వరలో 4.50 లక్షల ఇళ్లను అర్హులైన పేదలకు ఇస్తామన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామన్నారు.
ఖమ్మం జిల్లా ప్రజలకు మున్నేరు నుంచి తాగునీటిని అందించేందుకు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ వద్ద 15 టీఎంసీల సామర్థ్యంతో వీరభద్రుడి పేరుతో రిజర్వాయర్‌ను నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎన్ని నిధులైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటికే 30వేల ఉద్యోగాలను ఇచ్చిందని, ఇక నుంచి ఏటా 60 వేల ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై సవతితల్లి ప్రేమ చూపిస్తోందని విమర్శించారు. 8 మంది ఎంపీలను గెలుచుకొన్న ఆ ప్రభుత్వం ఈ రాష్ర్టానికి గాడిద గుడ్డు ఇచ్చిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో సీతారామ సహా ఎస్ఎల్బీసీ, పాలమూరు ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసే బాధ్యత తమదేనని అన్నారు. సభకు వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ అధ్యక్షత వహించగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.