బోనకల్లు, అక్టోబర్ 1 : సీఎం కేసీఆర్ ప్రజల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. సర్కార్ దవాఖానల్లో మౌలిక వసతులు కల్పించి బలోపేతం చేస్తున్నారు. ఆధునిక వైద్యపరికరాలు సమకూర్చి, వైద్యుల పోస్టులను భర్తీ చేసి వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇదే కోవలో బోనకల్లు మండల కేంద్రంలోని పీహెచ్సీ అన్ని వసతులు సమకూర్చుకుని ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నది. గతంలో అరకొర వసతులతో ఉన్న ఆసుపత్రి ఇప్పుడు అన్ని వసతులతో అందుబాటులోకి వచ్చింది. వైద్యులు సాధారణ జబ్బులతోపాటు డెంగీ, మలేరియా, టైఫాయిడ్, క్షయ వంటి వ్యాధులకూ చికిత్స అందిస్తున్నారు. మహిళ ఆరోగ్య సంరక్షణ కోసం ‘ఆరోగ్యలక్ష్మి’నీ అమలు చేస్తున్నారు. పచ్చని మొక్కలు, గార్డెనింగ్‌లో ఇప్పుడు ఆసుపత్రి ఆహ్లాదకరంగా దర్శనమిస్తున్నది.
వసతులు ఇలా..
ఆసుపత్రి వైద్యులు గర్భిణుల ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. సుఖప్రసవాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. హాస్పిటల్లో ఏర్పాటు చేసిన కాన్పుల విభాగంలో వైద్యులు ఈ సేవలు అందిస్తున్నారు. ఆస్పుత్రిలో ల్యాబొరేటరీతో పాటు ఆరు పడకల ఇన్‌పేషంట్ గది అందుబాటులో ఉన్నది. పీహెచ్సీ పరిధిలో మండలవ్యాప్తంగా తొమ్మిది సబ్ సెంటర్లు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 22 గ్రామాలకు చెందిన ప్రజలకు వైద్యసేవలు అందుతున్నాయి. వైద్యసేవల కోసం ఆసుపత్రికి వచ్చిన ప్రజలకు రక్తపరీక్షలతోపాటు ఇతర వైద్యపరీక్షలు చేయాల్సి వస్తే నిపుణులు వారి శాంపిల్స్ తీసి ఖమ్మంలోని ప్రధానాసుపత్రికి పంపిస్తున్నారు. వైద్యపరీక్షల రిపోర్ట్స్ అందుకున్న తర్వాత వ్యాధి నిర్ధారణ చేసి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
వరించిన అవార్డులు..
బోనకల్లు పీహెచ్సీ ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తించిన కేంద్రం 2019-20, 2020-21లో వరుసగా రెండుసార్లు కాయకల్ప అవార్డు ఇచ్చింది. 2020-21లో కేంద్ర బృందం వైద్యశాలను తనిఖీ చేసి ప్రజలకు అందిస్తున్న సేవలు, వైద్యశాలలో వసతులను గర్తించి జాతీయ నాణ్యతా ప్రమాణాల వైద్యశాఖ (ఎన్‌క్వాస్) అవార్డు ప్రకటించింది. ప్రజలకు ఉత్తమ వైద్యసేవలు అందిస్తున్న వైద్యాధికారులు బాలాజీ, తాటికొండ, శ్రీకాంత్ స్రవంతి, స్టాఫ్‌నర్స్ భవాని, ల్యాబ్అసిస్టెంట్ యాకుబ్‌అలీ ప్రభుత్వం నుంచి ఉత్తమ సేవా పురస్కారాలు అందుకున్నారు.
24 గంటల ఆసుపత్రిగా మార్చాలని ప్రజల డిమాండ్..
పీహెచ్‌సీని 24 గంటల ఆసుపత్రిగా మార్చాలని మండల ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రి ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 5గంటల వరకు మాత్రమే తెరచి ఉంటున్నది. దీంతో అత్యవసర వైద్యసేవలు అవసరమైనవారు ఖమ్మం నగరం లేదా మధిర పట్టణానికి వెళ్లాల్సి వస్తున్నది. గతంలో డెంగీ కేసులు పెరిగిన సందర్భంలో వైద్యులు ప్రజలకు 24 గంటల పాటు వైద్యసేవలు అందించారు. నిత్యం ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు స్టాఫ్‌నర్స్‌లు అందుబాటులో ఉన్నారు. కానీ ప్రస్తుతం ఒక డాక్టర్, ఒక స్టాఫ్‌నర్సు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు.
‘ఆరోగ్య మహిళ’తో మేలు
మా పీహెచ్సీ పరిధిలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం. గతంలో కంటే ఇప్పుడు ఓపీ పెరిగింది. ఆసుపత్రి ప్రజల మన్ననలు పొందుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్య సంరక్షణ కోసమే ‘ఆరోగ్య మహిళ’ పథకాన్ని అమలుచేస్తున్నది. మహిళలకు వైద్యపరీక్షలు నిర్వహించి ముందుగానే క్యాన్సర్ వంటి జబ్బులను గుర్తించి చికిత్స అందిస్తున్నది. పీహెచ్సీ పరిధిలో ఇప్పటివరకు 1,500 మందికి పరీక్షలు నిర్వహించాం. 325 మందిని జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశాం. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 35 ప్రసవాలు చేశాం. ప్రతిరోజూ 100- 150 మందికి వైద్యపరీక్షలు చేస్తున్నాం.
– డాక్టర్ స్రవంతి, పీహెచ్సీ వైద్యాధికారి, బోనకల్లు