ఇల్లెందు రూరల్, అక్టోబర్ 27: మండలంలోని బొజ్జాయిగూడెంలో నవంబర్ 1న జరుగనున్న సీఎం కేసీఆర్ సభకు జనాలను భారీగా సమీకరించనున్నట్లు బీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శీలం రమేష్, ఖమ్మంపాటి రేణుక చెప్పారు. సభను విజయవంతం చేయాలని కోరుతూ మండలంలోని బొజ్జాయిగూడెం, కొమరారం, పోలారం తదితర గ్రామాల్లో వారు శుక్రవారం విస్తృతంగా ప్రచారం చేశారు. నవంబర్ 1న మధ్యాహ్నం 2.00 గంటలకు సీఎం సభ ప్రారంభమవుతుందన్నారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మోసపోయే పార్టీలకు ఓటు వేసి గోస పడొద్దని, బీఆర్ఎస్ను మరోసారి గెలిపించాలని ప్రజలను కోరారు. వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.
ఇల్లెందు రూరల్, అక్టోబర్ 27: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ గెలుపునకు సైనికుల్లా పనిచేద్దామని ముఖ్య నాయకులు, కార్యకర్తలకు పార్టీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శీలం రమేష్, ఖమ్మంపాటి రేణుక పిలుపునిచ్చారు. మండలంలోని అన్ని పంచాయతీల్లో శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించి, ముఖ్య నాయకులు-కార్యకర్తలతో సమావేశమయ్యారు. హరిప్రియ గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, చేసిన అభివృద్ధిని, మేనిఫెస్టోలోని అంశాలను ఇంటింటికీ వెళ్లి వివరించాలని కోరారు. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టేలా ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగించాలన్నారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి హరిప్రియ చేసిన అభివృద్ధిని ప్రజలకు ప్రధానంగా వివరించాలని చెప్పారు.
ఇల్లెందు రూరల్, అక్టోబర్ 27: సీఎం కేసీఆర్ ప్రజాశీర్వాద సభకు యువతను సమీకరిస్తున్నట్లు బీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు నీలం రాజశేఖర్ చెప్పారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.
ఇల్లెందు, అక్టోబర్ 27: రైతు బంధు సహాయాన్ని ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు రానున్న ఎన్నికల్లో రైతులే బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ ఇల్లెందు పట్టణ అధ్యక్షుడు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.
టేకులపల్లి, అక్టోబర్ 27: బీఆర్ఎస్ ఇల్లెందు అభ్యర్థి, ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ శనివారం మండలంలో విస్తృతంగా పర్యటిస్తారు. గంగారం పంచాయతీలో ఉదయం 7.30 గంటలకు ప్రచారం ప్రారంభిస్తారు. అక్కడి నుంచి చింతోనిచెలక, మెళ్ళమడుగు, కిష్టారం, లచ్చగూడెం, కొప్పురాయి, బర్లగూడెం గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేస్తారు.
బయ్యారం, అక్టోబర్ 27: నవంబర్ 1న బొజ్జాయిగూడెంలో జరగనున్న సీఎం ప్రజాశీర్వాద సభను బీఆర్ఎస్ శ్రేణులు విజయవంతం చేయాలని మహబూబాబాద్ జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు పిలుపునిచ్చారు. సభకు జన సమీకరణపై శుక్రవారం ఆమె బయ్యారంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో స్థానిక నేతలతో చర్చించారు. మండలంలోని 29 పంచాయతీల నుంచి 10వేల మందిని తరలించాలన్నారు. సీఎం కేసీఆర్ సహకారంలో నియోజక వర్గం అభివృద్ధయిందని, దీనికి కృతజ్ఞతగా ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక్కరినైనా తరలించాలని అన్నారు. ప్రజాప్రతినిధులు-నాయకులు బానోత్ హరిసింగ్ నాయక్, తతా గణేష్, దిండిగల రాజేందర్, మూల మధుకర్ రెడ్డి, అంగోత్ శ్రీకాంత్ నాయక్, గంగుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.