ఖమ్మం, జనవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం, బీఆర్ఎస్ సభకు విచ్చేసిన పంజాబ్ సీఎం భగవంత్‌మాన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి రాజాతో పాటు ఇతర అతిథులకు సీఎం కేసీఆర్ కలెక్టరేట్లో విందు ఏర్పాటు చేశారు. నిర్వాహకులు శాకాహారం, మాంసాహారంతో కలిపి మొత్తం 46 రకాల వంటకాలు సిద్ధం చేశారు. వీటిలో ఎక్కువ వంటకాలు తెలంగాణవే కావడం విశేషం.
సీఎం కేసీఆర్ స్వయంగా అతిథులకు వంటకాలను వడ్డించారు. తెలంగాణ ప్రజలు ఎక్కువగా ఇష్టపడే తలకాయ కూర, బోటికూర, పచ్చిపులుసు, పప్పు, చేపల వేపుడు, చేపల పులుసు, రొయ్యల వేపుడు గురించి వివరించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ శాకాహారం భుజించగా, మిగిలిన అతిథులు మాంసాహారం స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజన్‌కుమార్ యాదవ్, మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాసయాదవ్, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, జగదీశ్వరరెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి ముఖ్యమంత్రులతో కలిసి భోజనం చేశారు. మరో ప్రత్యేక గదిలో శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎంపీలు విందు ఆరగించారు. డైనింగ్ హాళ్లకు ఇన్చార్జులుగా జిల్లా అధికారులు వ్యవహరించారు.