అశ్వారావుపేట, మే 16: టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదు.. ప్రతిభను నిరూపించుకునేందుకు అవకాశాలు రావాలి.. వేదికలు కావాలి.. అంతకుమించి మంచి ప్రోత్సాహం ఉండాలి. గ్రామీణస్థాయిలో విశేష ప్రతిభ ఉన్న క్రీడాకారులు ఎందరో ఉన్నారు. వారందరినీ ప్రోత్సహించేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం ‘చీఫ్ మినిస్టర్ కప్’ను వేదిక చేసింది. గ్రామీణ క్రీడాకారుల్లో టాలెంట్‌ను వెలికితీసేందుకు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లోని మూడు దశల్లో ఆటల పోటీలు నిర్వహిస్తున్నది. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమైన క్రీడా పోటీలు జిల్లాలోని 23 మండలాల్లో ఉత్సాహంగా సాగుతున్నాయి. క్రీడాకారుల్లో స్ఫూర్తి, స్నేహభావం పెంపొందేలా జరుగుతున్న పోటీలు ఈ నెల 31వ తేదీతో ముగియనున్నాయి. ఈ పోటీలను యువజన సర్వీసులు, క్రీడాశాఖాధికారులు పర్యవేక్షిస్తున్నారు. బుధవారంతో మండలస్థాయి పోటీలు పూర్తికానున్నాయి. మండలస్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు జరిగే జిల్లా స్థాయికి, జిల్లాలో గెలుపొందిన వారిని 28 నుంచి 31వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. మంచి ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు నగదు బహుమతితోపాటు ‘సీఎం కప్’ ట్రోఫీని ప్రభుత్వం అందించనున్నది.
తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ క్రీడలపై సైతం ప్రత్యేక దృష్టి సారించింది. క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ‘చీఫ్ మినిస్టర్ కప్’ పేరుతో పోటీలను నిర్వహిస్తున్నది. గ్రామీణస్థాయిలో క్రీడల పట్ల ఆసక్తి ఉన్న యువతను గుర్తించి స్నేహభావం పెంపొందించేందుకు కృషి చేస్తున్నది. క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి చేయూతనిచ్చేందుకు నిర్ణయించింది. పల్లెల నుంచి జిల్లాస్థాయికి క్రీడా ప్రతిభను ప్రోత్సహించడమే కాకుండా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసి సత్తా చాటుకునే అవకాశాన్ని కల్పిస్తున్నది. క్రీడల నిర్వహణకు మండలానికి రూ.15 వేలు జిల్లాస్థాయిలో రూ.75 వేలు చొప్పున 23 మండలాలకు నిధులను ప్రభుత్వం కేటాయించింది. క్రీడలను జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాస్థాయిలో కలెక్టర్ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు.
మూడు దశల్లో పోటీలు
గ్రామీణ స్థాయిలో క్రీడాకారుల ప్రతిభను రాష్ట్రస్థాయికి తీసుకెళ్లేందుకు అధికారులు మూడు దశల్లో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమైన మండల స్థాయి పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. మండల స్థాయిలో క్రీడా పోటీలు 17వ తేదీతో ముగియనున్నాయి. మండల స్థాయిలో వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను మండల కమిటీ బాధ్యులు జిల్లాస్థాయికి ఎంపిక చేస్తారు. ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు జిల్లాస్థాయిలో పోటీలు జరగనున్నాయి. జిల్లాస్థాయి క్రీడల్లో ప్రతిభావంతులను జిల్లా కమిటీ రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తుంది. రాష్ట్ర స్థాయిలో 28 నుంచి 31వ తేదీ వరకు పోటీలు జరగనున్నాయి.
పకడ్బందీగా పోటీలు
బాల, బాలికలకు అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాలురకు ఫుట్‌బాల్, జిల్లాస్థాయిలో అథ్లెటిక్స్‌తోపాటు ఫుట్‌బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, బాస్కెల్బాల్, బాక్సింగ్, హ్యాండ్‌బాల్, స్విమ్మింగ్, రెజ్లింగ్, రాష్ట్రస్థాయిలో అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, బాస్కెల్బాల్, బాక్సింగ్, హ్యాండ్‌బాల్, స్విమ్మింగ్, రెజ్లింగ్, ఆర్చరీ, జమ్నిస్టిక్స్, హాకీ, లాంగ్ టెన్నిస్ పోటీలు జరగనున్నాయి. క్రీడా పోటీలను పకడ్బందీగా నిర్వహించేందుకు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా సంఘాలు, కోచ్‌లు, సీనియర్ క్రీడాకారులతో అధికారులు పోటీలు నిర్వహిస్తున్నారు.
స్నేహభావం పెంపొందించేలా..
శారీరక దృఢత్వంతోపాటు మానసిక ప్రశాంతతకు దోహదపడే పోటీలను క్రీడాకారుల్లో స్నేహభావం పెంపొందించేలా అధికారులు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. దీనిద్వారా క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ‘చీఫ్ మినిస్టర్ కప్’ గ్రామీణ క్రీడాకారులకు వేదిక అవుతోంది. మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన ప్రతిభావంతులను జిల్లాస్థాయికి, జిల్లాలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు అధికారులు పంపనున్నారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధిస్తే రూ.20 వేలు, సిల్వర్ పతకానికి రూ.15 వేలు, కాంస్య పతకం సాధిస్తే రూ.10 వేలు, జట్ల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.లక్ష, ద్వితీయ స్థానం సాధిస్తే రూ.75 వేలు, తృతీయ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.50 వేలు నగదు ప్రోత్సాహంతోపాటు సీఎం కప్‌ను అందజేస్తారు.
గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం
గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేం దుకు రాష్ట్ర ప్రభుత్వం ‘చీఫ్ మినిస్టర్ కప్’ పేరుతో పోటీలను నిర్వహిస్తున్నది. మూడు దశల్లో పోటీలు నిర్వహించి రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చుకునే అవకాశాన్ని క్రీడాకారులకు కల్పిస్తున్నది. క్రీడలు శారీరక దృఢత్వంతోపాటు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయి. యువతకు మంచి ఆరోగ్యాన్నిస్తాయి. క్రీడాకారుల్లో స్నేహభావం పెంపొందించేలా రాష్ట్ర సర్కార్ క్రీడా పోటీలను పకడ్బందీగా నిర్వహిస్తున్నది.
– మెచ్చా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే, అశ్వారావుపేట
గ్రామీణ క్రీడాకారులకు సదావకాశం
గ్రామీణ క్రీడాకారు లకు ఇదో సదావకాశం. క్రీడా నైపుణ్యం ప్రదర్శిం చడానికి ప్రభుత్వం కల్పించిన ‘చీఫ్ మినిస్టర్ కప్’ మంచి వేదిక. గత ప్రభుత్వాలు గ్రామీణ క్రీడాకారులను నిర్లక్ష్యం చేయడం వల్ల ఎందరో వెలుగులోకి రాలేకపోయారు. కానీ తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆటల పోటీలు నిర్వహించటం ఎంతో మనోైస్థెర్యాన్ని కలిగిస్తున్నది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతిభను చాటుకుంటాను. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అవుతాననే దృఢ నమ్మకం ఉంది.
– ఎం.పవన్, క్రీడాకారుడు, అశ్వారావుపేట
ప్రతిభను చూపుకునే మంచి అవకాశం
గ్రామీణ క్రీడాకారులు ప్రోత్సాహం లేక వెనుకబడిపో కూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వారిలో ప్రతిభను గుర్తించేందుకు ‘చీఫ్ మినిస్టర్ కప్’ వేదికతో పోటీలు నిర్వహిస్తున్నది. గ్రామస్థాయి క్రీడాకారులు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఈ వేదిక ఒక మంచి అవకాశం. ప్రభుత్వం మండలం, జిల్లా, రాష్ట్రస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి క్రీడా పోటీలను పటిష్టంగా నిర్వహిస్తున్నది. ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి.
– తేజావత్ సీతారాంనాయక్, జిల్లా యూత్ అండ్ స్పోర్ట్ ఆఫీసర్, కొత్తగూడెం