ఖమ్మం అర్బన్/ కొత్తగూడెం గణేశ్ టెంపుల్/ మణుగూరు టౌన్/ భద్రాచలం/ పాల్వంచ రూరల్, మే 13 : పదో తరగతి అనంతరం పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు పాలిసెట్-25 ప్రవేశ పరీక్షను మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ నిర్వహించారు. ఖమ్మం నగరంలోని ఐదు కేంద్రాల్లో నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు 2,804 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 248 మంది గైర్హాజరయ్యారు. 2,556 మంది హాజరయ్యారు. హాజరైన వారిలో బాలురు 1,395 మంది, బాలికలు 1,161 మంది ఉన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి అనుమతి లేదని అధికారులు స్పష్టం చేయడంతో విద్యార్థులు ఉదయం 10 గంటలకల్లా పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 1:30 గంటల వరకు కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పరీక్షను ప్రశాంతంగా నిర్వహించినట్లు ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్, ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జాకీరుల్లా తెలిపారు.
పాలిసెట్ ప్రవేశ పరీక్ష భద్రాద్రి జిల్లాలోనూ మంగళవారం ప్రశాంతంగా ముగిసినట్లు పరీక్షల కో ఆర్డినేటర్, రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ తెలిపారు. కొత్తగూడెంలో 6, భద్రాచలంలో 2, మణుగూరులో 3 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించినట్లు చెప్పారు. మణుగూరులో 618 మంది విద్యార్థులు హాజరయ్యారని, 27 మంది గైర్హాజరయ్యారని, భద్రాచలంలోని 659 హాజరయ్యారని, 60 మంది గైర్హాజరయ్యారని, కొత్తగూడెంలో 1,840 మంది హాజరయ్యారని, 148 మంది గైర్హాజరయ్యారని వివరించారు. భద్రాద్రి జిల్లాలో మొత్తం 3,352 మంది విద్యార్థులకుగాను 3,117 మంది హాజరయ్యారని, 235 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.
పాలిసెట్‌కు హాజరైన విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్‌కార్డును చూపించాలంటూ కొత్తగూడెం సింగరేణి మహిళా డిగ్రీ కాలేజీ బాధ్యులు స్పష్టం చేయడంతో ఆధార్‌కార్డు తీసుకురాని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. సమీప ప్రాంతాల విద్యార్థులు కొద్దిమంది తమ ఇళ్లకు వెళ్లి ఆధార్ కార్డు తీసుకొచ్చారు. అయితే, కళాశాల లోపలికి వెళ్లిన విద్యార్థులను కూడా ఆధార్ లేదనే కారణంతో ప్రిన్సిపాల్ బయటకు పంపించారు. దీంతో కళాశాల ఎదుట తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కళాశాల వద్ద విధులు నిర్వహిస్తున్న వన్‌టౌన్ సీఐ కరుణాకర్.. మహిళా కాలేజీ నిర్వాహకులతో చర్చించి ఆధార్ కార్డు లేని విద్యార్థులను కూడా పరీక్ష కేంద్రంలోకి పంపించడంతో వారు పరీక్ష రాశారు. అదేవిధంగా, కేవలం పెన్నులు మాత్రమే తీసుకోవాలని హాల్‌టికెట్‌లో సూచించినప్పటికీ ఓఎంఆర్ షీట్లను పెన్సిళ్లతోనే బబ్లింగ్ చేయాలనడంతో విద్యార్థులు అప్పటికప్పుడు బుక్షాపులవైపు పరుగులు తీశారు. ప్రియదర్శిని డిగ్రీ కాలేజీలో పరీక్ష రాయాల్సిన ఓ విద్యార్థి పొరపాటున మహిళా కాలేజీకి వచ్చాడు. సమయంలేకపోవడంతో నిరాశతో వెను తిరుగుతున్న ఆ విద్యార్థిని వన్‌టౌన్ సీఐ కరుణాకర్ తన వాహనంలో ఎక్కించుకొని పరీక్ష కేంద్రానికి చేర్చారు.