ఖమ్మం సిటీ, ఆగస్టు 26: ఏదైనా రోగం వచ్చి ప్రైవేట్ ఆసుపత్రుల మెట్లెక్కితే చాలు.. వాటి యాజమాన్యాలు, వైద్యుల బృందాలు కలిసి రోగులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. అప్పటికీ ధన దాహం చల్లారక కాసుల కోసం వక్రమార్గాలను ఎంచుకుంటున్నాయి. ప్రభుత్వాలనే బురిడీ కొట్టిస్తూ రూ.కోట్లు దండుకున్నాయి. చివరికి తీగ లాగితే డొంక కదిలినట్లుగా అక్రమాలన్నీ బహిర్గతం అవుతుండడంతో గజగజా వణికిపోతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లాలో సీఎంఆర్ఎఫ్ బిల్లుల బాగోతం గతంలోనే తెరమీదకు వచ్చింది. రోగులకు వైద్య సేవలు చేయకుండానే ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు తప్పుడు బిల్లులు సమర్పించారు.
ఒకటీ రెండూ కాదు.. ఒక్కో దవాఖాన నుంచి నిరంతరం లక్షలాది రూపాయలకు సీఎంఆర్ఎఫ్ సహాయం కోసం దరఖాస్తులు వస్తున్నాయి. అనుమానం రావడంతో హైదరాబాద్లో సంబంధిత శాఖ రెవెన్యూ విభాగం ఇన్చార్జి డీఎస్ఎన్ మూర్తి.. అక్కడి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు గతేడాది ఏప్రిల్లో ఖమ్మం వచ్చారు. విషయం బయటకు తెలియకుండా విచారణ జరిపారు. ఆ క్రమంలో దవాఖానల రిజిస్టర్లు, బిల్లులను పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకున్నారు.
జిల్లాలోని 10 ప్రైవేట్ ఆసుపత్రులు ముఖ్యమంత్రి సహాయనిధికి తప్పుడు బిల్లులు సమర్పించినట్లు సీఐడీ విచారణలో బహిర్గతమైనట్లు తెలిసింది. ఖమ్మంలో 9, బోనకల్లు మండలంలో ఒకటి కలిపి మొత్తం పది ఆసుపత్రుల్లో అవకతవకలు జరిగినట్లు అధికారులు నిగ్గు తేల్చారని సమాచారం. వాటిల్లో శ్రీకర మల్టీ స్పెషాలిటీ, గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ, జేఆర్ ప్రసాద్ హాస్పిటల్, శ్రీ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, వైష్ణవి హాస్పిటల్, సుజాత హాస్పిటల్, న్యూ అమృత హాస్పిటల్, ఆరంజ్ హాస్పిటల్, మెగాశ్రీ హాస్పిటల్ (బోనకల్లు) సీఎంఆర్ఎఫ్ నిధులు స్వాహా చేసిన జాబితాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు, వైద్యులు, సిబ్బంది కుమ్మక్కై సర్కారు సొమ్మును కాజేసినట్లు వినికిడి. కాగా, రంగంలోకి దిగిన సీఐడీ.. అక్రమాల పుట్టను కదిలించి సేకరించిన ఆధారాల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసినట్లు పలువురు అధికారులు వెల్లడించారు. త్వరలోనే రెవెన్యూ యాక్ట్ ప్రకారం ఆయా ఆసుపత్రులపై రికవరీ యాక్ట్ ప్రయోగించడంతోపాటు కారకులపై వివిధ రకాల సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేయనున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఈ విషయాన్ని పసిగట్టిన ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు.. కేసుల నుంచి తప్పించుకునేందుకు ఇప్పటి నుంచే అధికార పార్టీ నేతలతో పైరవీలు చేయిస్తున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.