మా పంటలు ఎండిపోతున్నాయ్ సారో అని ఖమ్మంరూరల్ మండలం చింతపల్లి గ్రామ రైతులు మొత్తుకుంటున్నారు. వ్యవసాయ బావుల వద్ద లో వోల్టేజి సమస్యను పరిష్కరించండి మహాప్రభో అంటూ విద్యుత్ అధికారులను ప్రాధేయపడుతున్నారు. లోవోల్టేజి సమస్య వల్ల ప్రతిరోజూ ఇద్దరి, ముగ్గురి మోటార్లు కాలిపోతున్నాయని, దీంతో రూ.5 నుంచి రూ.6 వేల వరకు ఖర్చు అవుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక మోటార్‌ను బాగుచేయించే సరికి నాలుగు రోజులు పడుతుండడంతో పంటలు నిలువునా ఎండిపోతున్నాయని తమ గోసను వెలిబుచ్చుతున్నారు. విద్యుత్ అధికారులకు ఎంతమంది రైతులు మొరపెట్టుకున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీసం పెద్దసార్లు అయినా పట్టించుకొని తమ ప్రాంతంలో విద్యుత్ లోవోల్టేజి సమస్యను పరిష్కరించాలని చేతులెత్తి ప్రార్థిస్తున్నారు.
– ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 26
ఖమ్మంరూరల్ మండలంలో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగుకు చింతపల్లి గ్రామం పెట్టింది పేరు. గ్రామంలో అత్యధిక ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుత యాసంగి సీజన్లో వరి, మక్క పంటలతోపాటు, కూరగాయలు, ఆకుకూరలు భారీగా సాగు చేస్తున్నారు. వరి, మక్క, ఉద్యాన పంటలు చేతికి వచ్చే దశలో ఉన్నాయి. ఈ తరుణంలో రైతులను లోవోల్టేజి కరెంట్ సమస్య తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నది. గ్రామంలోని పలు ట్రాన్స్ఫార్మర్ల పరిధిలో అత్యధికంగా కరెంటు మోటార్లు ఉండడంతో లో వోల్జేజి సమస్య ఉత్పన్నమవుతున్నది.
ముఖ్యంగా ఆరెకోడు, చింతపల్లి గ్రామాల మధ్యన గల ట్రాన్స్ఫార్మర్ పరిధిలో దాదాపు 40 మోటార్లు ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. దీంతో గత నెలరోజుల నుంచి మాటిమాటికి కరెంట్ ట్రిప్ అవుతున్నది. తద్వార రైతుల కరెంట్ మోటార్లు కాలిపోవడం సర్వసాధారణంగా మారింది. నిత్యం ఇద్దరు, ముగ్గురు రైతుల మోటార్లు కాలిపోతున్నాయి. తిరిగి వైండింగ్ చేయించేందుకు గాను రైతులు ఖమ్మం నగరానికి తరలిస్తున్నారు. దీంతో ఒక్కో రైతుకు రూ.5 నుంచి రూ.6 వేల ఖర్చు అవుతున్నది. అదీకాక మూడు, నాలుగు రోజుల సమయం పడుతుండడంతో పంటలు ఎండిపోతున్నాయి. లోవోల్టేజి సమస్యలను అనేకసార్లు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు.
కరెంట్ కోతలు.. కర్షకుల ఇక్కట్లు
పూర్తిస్థాయిలో ఎండాకాలం రాకముందే ఖమ్మం రూరల్ మండలంలో కరెంట్ కోతలు ప్రారంభమయ్యాయి. యాసంగి పంటల సాగు ప్రారంభం నుంచి చింతపల్లి గ్రామంలో కరెంట్ కోతలు వేధిస్తున్నాయి. త్రీఫేస్ కరెంట్ రావాలంటే మధ్యాహ్నం ఒంటిగంట వరకు వేచిచూడాల్సిన పరిస్థితి. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 6 గంటల వరకు మాత్రమే త్రీఫేస్ కరెంట్ సరఫరా అవుతున్నది. తిరిగి అర్ధరాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారుజాము వరకు మాత్రమే ఉంటుంది. అయితే ఈ సమయాలు సైతం సరిగా పాటించడం లేదని రైతులు పేర్కొంటున్నారు. రాత్రిపూట కరెంట్ మోటార్ల వద్దకు వెళ్లలేని రైతులు మధ్యాహ్నం ఒంటి గంటకు ఒకేసారి అందరూ మోటార్లు ఆన్‌చేయడం.. దీంతో ట్రాన్స్ఫార్మర్పై లోడు పడుతుండడంతో నిత్యం మోటార్లు కాలిపోతున్నాయి. అయితే పదేండ్లపాటు నాటి బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కరెంట్ కోతలు లేవని, కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి తిరిగి కరెంట్ కోతలు ప్రారంభమయ్యాయని రైతులు వాపోతున్నారు. వానకాలం వరదల కారణంగా పంటలు ఆగమయ్యాయని, తీరా యాసంగిలో కరెంట్ కష్టాలు వేధిస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయించి నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
మాటిమాటికీ మోటార్లు కాలిపోతున్నాయి..
పాటిమీద ఉన్న ట్రాన్స్ఫార్మర్పై బాగా లోడు పడుతున్నది. దీంతో మాటిమాటికీ కరెంట్ మోటార్లు కాలిపోతున్నాయి. ప్రతిరోజు ఇద్దరి, ముగ్గురి మోటార్లు కాలిపోతున్నాయి. తిరిగి వైండింగ్ చేయించాలంటే ఖర్చుతోపాటు సమయం వృథా అవుతున్నది. ఈలోపు పంటలు ఎండిపోతున్నాయి. నిన్ననే మా మోటారు కాలిపోయింది. కరెంట్ సార్లకు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవడం లేదు. ఏడాది నుంచి ఇదే గోస పడుతున్నాం.
– తోట నరేశ్, యువరైతు, చింతపల్లి, ఖమ్మం రూరల్
చేతికొచ్చిన పంటలు మాడిపోతున్నాయి..
ఈ సీజన్లో ఐదెకరాలు వరి, ఐదెకరాలు మక్కపంట సాగు చేశాను. నాలుగు రోజుల క్రితం మా మోటారు కాలిపోయింది. దీంతో పంటలకు నీరు అందక ఆగమైపోతున్నాయి. గతంలో భక్తరామదాసు ప్రాజెక్టు కాలువ కోసం మా విలువైన భూములు ఇచ్చాం. కనీసం కాలువ ద్వారా నీరు వదిలినా బాగుండేది. చెరువులో నీళ్లు అయిపోయాయి. ఇంకో ట్రాన్స్ఫార్మర్ వేయండి సారో అని ఎన్నిసార్లు కరెంటోళ్లకు చెప్పినా పట్టించుకోవడం లేదు.
– టీ.చిన్నప్పయ్య, రైతు, చింతపల్లి, ఖమ్మం రూరల్
అధికారులు పట్టించుకోవడం లేదు..
మా పంట పొలాలు ట్రాన్స్ఫార్మర్ పక్కనే ఉన్నాయి. లోవోల్జేజి ద్వారా మూడురోజుల క్రితం నా మోటారు కాలిపోయింది. తిరిగి బాగు చేయించుకొని వచ్చాను. కానీ స్విచ్ వేయాలంటే భయమేస్తున్నది. రెండు ఫేస్‌ల కరెంట్ మాత్రమే వస్తున్నది. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. మధ్యాహ్నం ఒంటిగంటకు త్రీఫేస్ కరెంట్ ఇస్తుండటంతో అందరూ ఒకేసారి మోటార్లు ఆన్ చేయడంతో లోడు పడుతున్నది. దీంతో మోటార్లు కాలిపోతున్నాయి. సమయానికి నీరు అందక మా ఆకుకూరలు నిలువునా ఎండిపోతున్నాయి. కరెంట్ సమస్య తీర్చండి మహాప్రభో.
– మండల నాగేశ్వరరావు, రైతు, చింతపల్లి, ఖమ్మం రూరల్