Khammam Collector | కారేపల్లి, ఫిబ్రవరి 18: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు పరిసర గ్రామాల్లో మంగళవారం కలెక్టర్ ముజిమిల్ ఖాన్ విస్తృతంగా పర్యటించారు. స్థానిక విద్యుత్ శాఖ ఏఈ వ్యవహార శైలిపై కలెక్టర్కు ఆ గ్రామాల రైతులు ఫిర్యాదు చేశారు. తాము బోరు బావులపై ఆధారపడి పంటలు సాగు చేసుకుంటున్నామని, కానీ సక్రమంగా కరెంట్ సరఫరా లేక నష్టపోతున్నామని కలెక్టర్ ముందు వాపోయారు. తమ ప్రాంతంలో ఎక్కువగా విద్యుత్ హై, లో వోల్టేజ్ సమస్యలు వస్తాయన్నారు. స్థానికంగా ఏఈ అందుబాటులో ఉండకపోవడం వల్ల కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల మరమ్మత్తులకు ఆలస్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్లలో సంప్రదించాలని ప్రయత్నించినా స్పందించడం లేదని ఆరోపించారు.
సంబంధిత అధికారులు,సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేలా కృషి చేయాలని కలెక్టర్ ను వేడుకున్నారు. దీంతో స్పందించిన కలెక్టర్ వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయడంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పక్కనే ఉన్న విద్యుత్ శాఖ ఉన్నత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు తాము పనిచేసే చోట విధులు నిర్వర్తించి స్థానిక ప్రజల మన్ననలు పొందాలని అధికార యంత్రంగానికి కలెక్టర్ సూచించారు.