కారేపల్లి : ఇంటర్మీడియట్ రెండో సంవత్సర ఫలితాల్లో కారేపల్లి మండలం చీమలపాడుకు చెందిన వర్షిత్ ప్రభంజనం సృష్టించాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన వర్షిత్ రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంక్ సాధించాడు. ఎంపీసీలో ప్రతిభ చూపిన ఈ కుర్రాడు 994/1000 మార్కులు సాధించి స్టేట్ టాపర్గా నిలిచాడు.
చీమలపాడుకు చెందిన శ్రీనివాసరావు-ఉమ దంపతుల కుమారుడైన వర్షిత్ చిన్నతనం నుండే చదువులో చురుకుగా ఉండేవాడు. తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబానికి చెందిన వారైనప్పటికీ తమ పిల్లలను ఉన్నతంగా చదివించాలనుకున్నారు. అందుకని జిల్లా కేంద్రమైన ఖమ్మం వచ్చి ప్రైవేటు హాస్టల్ పెట్టి జీవనోపాధి పొందండంతో పాటు తమ పిల్లలను బాగా చదివించారు.
ఖమ్మం నారాయణ కళాశాలలో ఇంటర్ విద్యనభ్యసించిన వర్షిత్ వార్షిక పరీక్షల్లో సత్తా చాటాడు. ఏకంగా రాష్ట్రస్ధాయిలో 3వ ర్యాంకుతో ఔరా అనిపించాడు. భవిష్యత్లో కంప్యూటర్ ఇంజనీరింగ్ కావాలనేది తన లక్ష్యమంటున్న వర్షిత్.. వ్యవసాయరంగానికి సాంకేతను జోడించి రైతన్నలకు ఉపయోగపడే ఆవిష్కరణలు చేయాలని ఉందని చెబుతున్నాడు.