రఘునాథపాలెం, జనవరి 21 : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర పైపైకి వెళ్తున్నది. మంగళవారంతో పోల్చితే ఒక్క రోజులోనే భారీగా ధర పెరిగింది. ఈ ఏడాది ఇదే అధిక పెరుగుదల అని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,200, కొత్త మిర్చి ధర రూ.20 వేలకు చేరింది. దీంతో పంట విక్రయానికి తరలించిన రైతుల్లో ఆశలు చిగురించాయి. వారం రోజుల క్రితం వరకు పోల్చితే మిర్చి ధర కేవలం రూ.15 వేలకే పరిమితమైంది. అయితే రెండు రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన మిర్చి ధర బుధవారం నాటికి రూ.20 వేల మార్క్‌ను చేరింది.
వ్యవసాయ మార్కెట్‌కు కొత్త మిర్చి భారీగా వస్తుండడంతో ధరలో పురోగతి కనిపిస్తున్నది. 2024లో మిర్చి క్వింటా ధర రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పలికింది. రెండేళ్లుగా తెలంగాణ మిర్చికి విదేశాల్లో డిమాండ్ లేకపోవడంతో ధర భారీగా పడిపోయింది. కాగా, ఈ ఏడాది తెగుళ్లు, అధిక వర్షాల కారణంగా దిగుబడులు పూర్తిగా తగ్గాయి. ఏటా లక్ష ఎకరాల్లో సాగయ్యే మిర్చి.. ఈ ఏడాది కేవలం 40 వేల ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. ఈ క్రమంలో దిగుబడులు తగ్గడంతో విదేశీ మార్కెట్లో మిర్చికి డిమాండ్ పెరిగింది. కాగా, బుధవారం ఖమ్మం మార్కెట్‌కు 13 వేల బస్తాలు వచ్చినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. సీజన్లో మార్కెట్‌కు వచ్చే సరుకు పెరిగినప్పటికీ ఇదే ధర నిలకడగా ఉండాలని రైతులు కోరుతున్నారు.