రఘునాథపాలెం, ఏప్రిల్ 18 : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులదే ఇష్టారాజ్యం. ధర పెంచాలన్నా.. తగ్గించాలన్నా అంతా వారి చేతుల్లోనే ఉంటుంది. మార్కెట్ పాలకవర్గమైనా, అధికారులైనా వ్యాపారుల అడుగులకు మడుగులొత్తాల్సిందే. మార్కెట్కు పంట తక్కువ వస్తే ఆ రోజు ధరను అమాంతం పెంచేస్తారు.. పెంచిన ధర మరుసటి రోజు పంట అత్యధికంగా వచ్చేందుకు దోహదపడుతుందనే జిమ్మిక్కును వ్యాపారులు ప్రయోగిస్తున్నారు.
పెరిగిన ధరను చూసి ఆశతో రైతులు మరుసటిరోజు పంటను అధికమొత్తంలో మార్కెట్కు తీసుకొస్తే తీరా జెండాపాటను అమాంతం తగ్గించేస్తారు వ్యాపారులు. ఇది ఏనాటి నుంచో జరుగుతున్న తంతే ఐనప్పటికీ వ్యాపారుల జిమ్మిక్కులను అటు అధికారులు, ఇటు పాలకవర్గాలు కానీ అరికట్టలేకపోతున్నాయి. ఫలితంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు వస్తున్న అమాయక రైతులు ఏళ్లుగా మోసానికి గురవుతూనే ఉన్నారు. ఖమ్మం మార్కెట్లో శనివారం వ్యాపారులు ఏకంగా క్వింటా మిర్చి ధరను రూ.21,700లకు జెండా పాటగా పాడారు.
ఈ ధర ఈ సీజన్లో ఇదే అత్యధికం కావడంపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఇదే తరహా ధర ఉంటుందా..? అనే సందిగ్ధాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సెలవురోజు అనంతరం సోమవారం మార్కెట్కు మిర్చి పోటెత్తి రావాలనే జిమ్మిక్కుతో శనివారం అధిక ధర ఆశను రైతులకు ‘ఎర’గా వేశారనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు 23వేల మిర్చి బస్తాలు వచ్చాయి.