రఘునాథపాలెం, ఫిబ్రవరి 18: ఖమ్మంలో మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలని రైతు సంఘాల నాయకులు, రైతులు డిమాండ్ చేశారు. క్వింటా మిర్చికి రూ.25 వేలు ధర నిర్ణయించాలని, ఆ ధర ప్రకారం రైతుల నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. ఈ మేరకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఎదుట మంగళవారం వారు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఎం అనుబంధ రైతు సంఘం రాష్ట్ర అద్యక్షుడు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ.. ఏఎంసీలో దళారుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని, మిర్చికి మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. అత్యధిక విస్తీర్ణంలో మిర్చి సాగయ్యే ఖమ్మం జిల్లాలో మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నాఫెడ్, మార్క్ఫెడ్ సంస్థల ద్వారా క్వింటాకు రూ.25 వేల చొప్పున నిర్ణయించి కొనుగోలు చేయాలన్నారు. గత సీజన్లో క్వింటాకు రూ.25 వేలుగా ఉన్న ధర ఇప్పుడు రూ.12 వేలు కూడా పలికే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంఘం నాయకులు, సీపీఎం నేతలు తదితరులు పాల్గొన్నారు.
నిరుటితో పోలిస్తే మర్చి ధరలు సగానికి సగం పడిపోయాయాని, కానీ పెట్టుబడులు మాత్రం రెట్టింపయ్యాయని సీపీఐ అనుబంధ రైతు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటుచేయాలని, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం ఏఎంసీ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఐ అనుబంధ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు ఆధ్వర్యంలో సంఘం నేతలు ఖమ్మం ఏఎంసీలో మిర్చి కొనుగోళ్లను అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. దీంతో వీరిని పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకొని ఏఎంసీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు.. నిరసన వద్దకు వచ్చారు. వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి మిర్చి ధర పెంపునకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సీపీఐ నేతలు, అనుబంధ రైతు సంఘ నేతలు పాల్గొన్నారు.