నిరుడు ఇదే రోజుల్లో అమాంతంగా పెరిగిన తేజా మిర్చి ధరలు ప్రస్తుత సీజన్లో తిరోగమనం దిశగా పయనిస్తున్నాయి. దీంతో ఆరుగాలం కష్టించి తీరా మార్కెట్‌కు పంటను తీసుకొచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఆశలు, కోర్కెలు పెట్టుకొని సాగు చేసిన రైతులకు ధరలను చూసి దిగ్భ్రాంతికి గురవుతున్నారు. రైతు చేతి నుంచి పంట చేదాటిన మరుసటిరోజు నుంచి అమాంతంగా ధరలు పెరగడం, తీరా రైతు చేతికి పంట వచ్చేసరికి పంట ధర తగ్గడం పరిపాటిగా మారింది.
ప్రతి ఏటా ఖమ్మం జిల్లావ్యాప్తంగా తేజా రకం పంటను సాగు చేసిన రైతులకు ఇదే అనుభవం ఎదురవుతున్నది. ఇందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధానంగా జాతీయస్థాయిలో మిర్చికి మద్దతు ధర లేకపోవడమే అంటున్నారు అధికారులు. రైతు పండించిన ప్రతి పంటకూ మద్దతు ధర ఉన్నప్పటికీ మిర్చి పంటకు లేకపోవడంతో ఖరీదుదారులకు వరంగా మారింది.
-ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 15
సీజన్ ఆరంభం నుంచి మిర్చి ధరలు తగ్గడానికి ప్రధాన కారణం ఇతర దేశాలు, రాష్ర్టాలకు ఎగుమతులు లేకపోవడమే. దీంతో వ్యాపారులు ఇతర రాష్ర్టాలకు చెందిన వ్యాపారులకు ఎగుమతి చేస్తున్నారు. సాధారణంగా ఏసీరకం మిర్చి పంట ప్రతి ఏటా చైనా, థాయ్‌లాండ్, బ్యాంకాక్, సింగపూర్ దేశాలకు ఎగుమతి అవుతుంటుంది. గత సంవత్సరం కోల్డ్ స్టోరేజీలు పూర్తిగా ఖాళీకావడంతో ఇదే అదనుగా భావించిన రైతులు, కొందరు వ్యాపారులు భారీ మొత్తంలో పంటను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకున్నారు. రికార్డు స్థాయిలో 40 లక్షలకు పైగా బస్తాలను నిల్వ చేసుకున్నారు.
క్వింటాల్ రూ.18 వేల నుంచి రూ.20 వేలు పలికినప్పటికీ రాబోయే రోజుల్లో మరింత ధర పెరుగుతుందని భావించి పంటను దాచుకున్నారు. పక్షం రోజుల నుంచి అంచెలంచెలుగా ధరలు తగ్గుతూ గురువారం నాటికి రికార్డు స్థాయికి తగ్గిపోయాయి. గురువారం నగర వ్యవసాయ మార్కెట్లో ఏసీ రకం మిర్చి క్వింటా రూ.16,900 పలుకగా.. కనిష్టంగా క్వింటా రూ.7 వేల చొప్పున ఖరీదుదారులు పంటను కొనుగోలు చేశారు. మిర్చి పంటకు మద్దతు ధర లేకపోవడంతో ధరలు తగ్గడం.. తద్వార రైతులు ఆర్థికంగా నష్టపోవడానికి ప్రధాన కారణమవుతుందని రైతు సంఘాల నాయకులు తెలుపుతున్నారు. మిర్చి పంటకు మద్దతు ధర లేకపోవడంతో తాము చెప్పిందే మద్దతు ధర అని వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా తేజా రకం మిర్చి పంటను ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లా రైతులు మాత్రమే ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ రకం పంట ఘాటైనది కావడంతో 90 శాతం పంట ఇతర దేశాలైన చైనా, థాయ్‌లాండ్, బ్యాంకాక్, సింగపూర్‌కు ఎగుమతి జరుగుతుంది. సాధారణం రకం పంటను ఇక్కడే ప్రాసెసింగ్ చేసి వినియోగంలోకి తీసుకొస్తుంటారు. ప్రతి ఏటా ఖమ్మం మార్కెట్‌కు జిల్లా రైతులతోపాటు పొరుగు జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, కృష్ణా జిల్లాల నుంచి రైతులు తీసుకొస్తున్నారు. గత ఏడాది సాగు చేసిన మిర్చి పంటకు సైతం ఇదే పరిస్థితి ఎదురుకావడంతో సదరు రైతులు కోల్డ్ స్టోరేజీల్లో పంటను నిల్వ చేసుకున్నారు.