ఖమ్మం రూరల్, ఏప్రిల్ 08 : గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన బాలల సంరక్షణ కమిటీలను మరింత బలోపేతం చేయాలని ఖమ్మం రూరల్ మండల ప్రత్యేక అధికారి జి. జ్యోతి అన్నారు. సమగ్ర బాలల పరిరక్షణ పథకం (ఐ సి పి ఎస్) ఆధ్వర్యంలో మంగళవారం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో స్పెషలాఫీసర్ అధ్యక్షతన మండల స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో విధిగా బాలల సంరక్షణ కమిటీలను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు బాలల హక్కుల సంరక్షణపై అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో బాలలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకువచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
ముఖ్యంగా బాల కార్మికులు, బాల్య విహాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ఎంపీడీఓ ఎస్.కుమార్, తాసీల్దార్ ఇ.రాంప్రసాద్, రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అనిల్ మాట్లాడుతూ మత పెద్దలు, పురోహితులతో సమావేశాలు ఏర్పాటు చేసి బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలల స్థాయిలో ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేసి సెల్ఫోన్స్, మాదకద్రవ్యాల వినియోగం ద్వారా కలిగే ఇబ్బందులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. బాలల అక్రమ రవాణా, లైంగిక దాడుల నిరోధానికి తీసుకుంటున్న చర్యలను పోలీసు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో బాధ్యులు ఎన్జీఓ ప్రతినిధులు, ఐసీడీఎస్ అధికారులు, ఐకేపీ, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ఎంపీఓ శ్రీదేవి పాల్గొన్నారు.