కొత్తగూడెం ప్రగతి మైదాన్, మార్చి 29 : దండకారణ్యంలో మళ్లీ తుపాకుల మోత మోగింది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య భీకర పోరు సాగింది. నువ్వా.. నేనా అన్నట్లు సాగిన యుద్ధంలో 17 మంది మావోయిస్టులు మృతిచెందగా.. నలుగురు జవాన్లు సైతం గాయపడ్డారు. మృతుల్లో రూ.25 లక్షల రివార్డు ఉన్న పెద్ద క్యాడర్ మావోయిస్టు కూడా ఉన్నాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కేరళపాల్లో శనివారం చోటు చేసుకుంది. వివరాలను బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ పాటిలింగం మీడియాకు వెల్లడించారు. కేరళపాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అడవుల్లో మావోయిస్టులు సమావేశమయ్యారనే విశ్వసనీయ సమాచారం భద్రతా దళాల ఉన్నతాధికారులకు అందింది.
దీంతో జిల్లా రిజర్వు గార్డ్స్(డీఆర్జీ), సీఆర్పీఎఫ్కి చెందిన సుమారు 600 మంది సైనిక దళాలు సంయుక్తంగా మావోయిస్టుల కోసం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఉపంపల్లి అడవుల్లో మావోయిస్టులు తారసపడి జవాన్లపైకి కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు నలుదిక్కుల నుంచి ఎదురుకాల్పులకు దిగారు. ఇరువర్గాల మధ్య పలుమార్లు ఎదురుకాల్పులు చోటు చేసుకోవడంతో జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే దట్టమైన అటవీ మార్గం ద్వారా పారిపోయారు. కాల్పుల విరమణ తర్వాత జవాన్లు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపట్టారు.
ఎదురుకాల్పుల్లో మృతిచెందిన 17 మంది మావోయిస్టుల మృతదేహాలతోపాటు రెండు ఏకే-47 గన్లు, ఎస్ఎల్ఆర్లతోపాటు 12 ఆయుధాలను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో 11 మంది మహిళా మావోయిస్టులు, రూ.25 లక్షల రివార్డు ఉన్న స్టేట్ జోనల్ కమిటీ సభ్యుడు జగదీశ్ అలియాస్ భుద్ర ఉన్నట్లు పోలీస్ అధికారులు ధ్రువీకరించారు. డీఆర్జీకి చెందిన ముగ్గురు, సీఆర్పీఎఫ్కి చెందిన ఒక జవాన్ గాయపడ్డారు. గాయపడిన జవాన్లు ప్రమాదం నుంచి బయటపడినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ నెల 25న బీజాపూర్, నారాయణ్‌పూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో రూ.25 లక్షల రివార్డు ఉన్న డీకేఎస్జడ్ఎం సుధీర్‌తో సహా 30 మంది మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. గడిచిన పది రోజుల్లో బస్తర్ రేంజ్ పరిధిలో 49 మంది మావోయిస్టులు భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో మృతిచెందారు. పెద్ద తలలే టార్గెట్‌గా ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో ఆపరేషన్ ‘కగార్’ కొనసాగుతున్నది. వారం రోజుల వ్యవధిలో జరిగిన రెండు భారీ ఎన్కౌంటర్లలో ఒక్కొక్కరిపై రూ.25 లక్షల రివార్డు ఉన్న సుధీర్, జగదీశ్‌లు మృతిచెందడమే ఇందుకు ఉదాహరణ.
ఇప్పటికే దండకారణ్యాన్ని 60 శాతం భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ప్రస్తుత పరిణామాలనుబట్టి తెలుస్తున్నది. సుక్మా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 17 మంది మావోయిస్టులు మృతిచెందగా.. మరికొందరికి బుల్లెట్ గాయాలైనట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ పాటిలింగం, సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ ఘటనా స్థలాన్ని సందర్శించి.. పారిపోయిన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ప్రస్తుత ఘటనలో మిగతా మృతుల వివరాల కోసం దర్యాప్తు చేపట్టామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఐజీ సుందర్రాజ్ తెలిపారు.