నకిలీ విత్తన విక్రయాలకు చెక్ పెడుతున్నది తెలంగాణ ప్రభుత్వం. ఇక నుంచి ఆన్లైన్ ద్వారానే క్రయవిక్రయాలు జరుగనుండడంతో పారదర్శకత పెరగనున్నది. దీంతో డీలర్లు తమకు నచ్చిన, లాభాన్ని తెచ్చే విత్తనాలను విక్రయించేందుకు అవకాశం లేకుండా పోతుంది. దీంతో కర్షకులకు మేలు జరుగనున్నది. విత్తనాల కృత్రిమ కొరతకు కూడా వీలుండదు. ఆన్లైన్ నిర్వహణ గురించి జిల్లా వ్యవసాయశాఖ అధికారులు.. ఆయా విత్తన డీలర్లకు ఇప్పటికే అవగాహన కల్పించారు. యూజర్ ఐడీ, పాస్వర్డ్ వంటివి కూడా అందించారు. ప్రతి నెలా 1 – 5 తేదీల్లోపు సదరు డీలరు తాము కొనుగోలు చేసిన ఆయా కంపెనీల విత్తనాల వివరాలు, అమ్మకాలు, స్టాక్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. మరికొద్ది రోజుల్లో విత్తనాల విక్రయాలు ముమ్మరం కానుండడంతో వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. అధికారులు ఆకస్మిక తనిఖీలకు వచ్చిన సమయంలో సదరు డీలర్ దగ్గర ఆన్లైన్లో పొందుపరిచిన విధంగానే స్టాక్ ఉండాలి. లేకుంటే డీలర్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో నకిలీ విత్తనాలకు పూర్తిగా చెక్ పడనున్నది.
– ఖమ్మం, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖమ్మం, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టి సొమ్ము చేసుకోవాలనుకునేవారికి చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. మూస పద్ధతిలో విత్తనాల క్రయవిక్రయాలు చేపట్టే విధానానికి ముగింపు పలికింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా లైసెన్స్ కలిగిన విత్తన డీలర్లు మాత్రమే ఇక నుంచి విత్తనాలు విక్రయించాల్సి ఉంటుంది. ఇందుకు గాను రాష్ట వ్యవసాయశాఖ ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించింది. www. seedsgrowerp.com /olms అనే ఈ సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లా సీడ్ లైసెన్స్ ద్వారా రిజిస్టర్ అయిన డీలర్లు ఈ సైట్ ద్వారానే క్రయవిక్రయాలు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు విత్తన డీలర్లు కూడా ఈ సైట్ ద్వారానే విక్రయించాల్సి ఉంటుంది.
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 586 మంది విత్తన డీలర్లకు ఇప్పటికే జిల్లా వ్యవసాయశాఖ యూజర్ ఐడీ, పాస్వర్డ్ అందించింది. ప్రతి నెలా 1 – 5 తేదీల్లోపు సదరు డీలరు తాను కొనుగోలు చేసిన ఆయా కంపెనీల విత్తనాల వివరాలు, అమ్మకం, స్టాక్ వివరాలను ఈ సైట్లో పొందుపరచాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ వినియోగ విధానంపై మండల వ్యవసాయశాఖ అధికారులు విత్తన డీలర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ఏ ఒక్క రైతూ నకిలీల బారిన పడకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన ప్రణాళిక సిద్ధం చేశారు. మరికొద్ది రోజుల్లో విత్తనాల విక్రయాలు ముమ్మరం కానుండడంతో వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. గతంలో వానకాలం సీజన్‌కు సంబంధించి నకిలీ మిర్చి విత్తనాలు కొనుగోలు చేసి రైతులు భారీగా నష్టపోయిన ఘటనలు, తిరుమలాయపాలెం మండలంలో అనుమతి లేని పురుగుమందులు భారీగా లభ్యమైన సంఘటనలును అనేకం ఉన్నాయి. వీటన్నింటి దృష్ట్యా నిఘాను ముమ్మరం చేశారు. రానున్న రోజుల్లో ఏ ఒక్క రైతుకూ విత్తన, ఎరువుల కొరత రాకుండా ఉండేందుకోసం తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్, మార్క్‌ఫెడ్ అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ముందస్తుగానే జిల్లాలో ఉన్న సొసైటీలకు విత్తనాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
సీజన్ ప్రారంభం కాగానే కొందరు విత్తన డీలర్లు రైతులు ఆసక్తి కనపరచిన విత్తనాలను బ్లాక్ చేస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. నూతనంగా ప్రవేశపెట్టిన ఈ సైట్ ద్వారా కృత్రిమ కొరతకు చెక్‌పడనుంది. ఒకవైపు డైలీ రిపోర్ట్‌ను మాన్యువల్‌గా సిద్ధం చేయడంతో ప్రతి నెలా విధిగా విత్తన డీలర్ ప్రత్యేకంగా రూపొందించిన సైట్లో అవసరమైన వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. అధికారులు ఆకస్మిక తనిఖీలకు వచ్చిన సమయంలో సదరు డీలర్ దగ్గర ఆన్లైన్లో పొందుపరిచిన విధంగానే స్టాక్ ఉండాలి. లేకుంటే సదరు డీలర్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా నకిలీ విత్తనాలకు సైతం ఈ విధానంతో పూర్తిగా చెక్‌పడనుంది. కేవలం ప్రభుత్వం ఆమోదించిన విత్తన కంపెనీల వివరాలను మాత్రమే వెబ్సైట్ తీసుకుంటుంది. అనుమతి లేని విత్తనాలను పొందుపరచడానికి వీలుండదు. దీంతో సదరు వ్యాపారి గోడౌన్లో గానీ, షాపుల్లో గానీ ఆన్లైన్లో పొందుపరిచిన విత్తనాలను కాకుండా వేరే విత్తనాలు పెట్టడానికి వీల్లేదు. ఒకవేళ తనిఖీల సమయంలో అవి లభ్యమైతే డీలర్ లైసెన్స్ రద్దు చేయడంతోపాటు చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రతి రైతుకూ నాణ్యమైన విత్తనాలు అందించడం, కృత్రిమ కొరతకు తావులేకుండా చూడడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇప్పటికేజిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల వ్యవసాయశాఖ అధికారులు మండలంలోని విత్తన డీలర్లకు సైట్ నిర్వహణపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు.
ప్రభుత్వం ఆమోదించిన కంపెనీల విత్తనాలు మాత్రమే డీలర్లు విక్రయించేందుకు ఈ వైబ్సెట్ అందుబాటులోకి వచ్చింది. డీలర్ ప్రతి నెలా ఈ సైట్లో అన్ని రకాల వివరాలు నమోదు చేయాలి. నిర్దిష్ట సమయంలోనే వివరాలు నమోదు చేయాలనే అంశాలపై వారికి అవగాహన కల్పించాం. కృత్రిమ కొరతకు ఇక నుంచి చెక్‌పడనుంది. మండల, డివిజన్, జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ఎప్పటికప్పుడు జిల్లాకు వచ్చిన విత్తనాలు, రైతులు కొనుగోలు చేసిన విత్తనాలను పరిశీలించడానికి మార్గం సుగమం అవుతుంది. విత్తనాల కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడానికి సైతం ఈ విధానం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
– ఎం.విజయనిర్మల, డీఏవో, ఖమ్మం