కారేపల్లి, మార్చి 11 : మండల కేంద్రంలో గల విద్యా వనరుల కేంద్రంలో ప్రతి మంగళవారం ఏర్పాటు చేస్తున్న ఫిజియోథెరపీ ప్రత్యేక శిబిరాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని శిక్షకురాలు రూతమ్మ అన్నారు. స్థానిక ఎంఆర్సీ కార్యాలయ ప్రాంగణంలో మండలానికి చెందిన పలువురు దివ్యాంగులకు ఫిజియోథెరపీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాళ్లు, చేతులు ఇతర అవయవాలు వంకరగా ఉన్న విద్యార్థులకు ప్రతిరోజు ఫిజియోథెరపీ చేయడం వల్ల కొంత మేరకు మార్పు కనపడుతుందన్నారు.
ప్రతి మండల కేంద్రంలో దివ్యాంగులకు విద్యాభ్యాసంతో పాటు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఐఈఆర్పీలను నియమించడం జరిగిందన్నారు. దివ్యాంగులతో పాటు వారితో వెంటవచ్చే మరొకరికి ప్రభుత్వం రవాణా ఖర్చులను సైతం చెల్లిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ఉపయోగకరమైన పరికరాలను ప్రభుత్వం అందజేస్తున్నారు. ఈ అవకాశాన్ని మండలంలోని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఐఈఆర్పీ తాళ్లూరి శైలజ, విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులు పాల్గొన్నారు.