కారేపల్లి, సెప్టెంబర్ 16 : గిరిజన సంక్షేమ శాఖలోని ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయడంతో పాటు ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నెల 19న హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్‌లోని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టనున్నట్లు టీఎస్ యూటీఎఫ్ ఖమ్మం జిల్లా కార్యదర్శి బానోత్ రాందాస్ తెలిపారు. ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రంలో మంగళవారం జరిగిన ఆ సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రమోషన్ కౌన్సిలింగ్ నిర్వహించాలని, అనేక ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని గత మూడు నెలలుగా కమిషనర్, సెక్రటరీ, మంత్రులకు విన్నవించినప్పటికీ స్పందన లేకపోవడంతో అనివార్యంగా పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. ఇందుకు కమిషనర్ కార్యాలయమే కారణమని ఆరోపించారు. అప్పటికీ అధికారులు స్పందించి సమస్యల పరిష్కారానికి ముందుకు రాకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని, అందుకు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు బానోత్ సూర్య, ఫణికుమార్, నాగలక్ష్మి, నాగేశ్వరరావు, రామారావు, శివకోటి, రామకృష్ణ, సోమయ్య చారి, నరేంద్ర, సుజాత, సావిత్రి పాల్గొన్నారు.