దొరల పెత్తనాన్ని ఎదిరించి.. రజాకార్లను తరిమికొట్టిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భద్రాద్రి కలెక్టరేట్లో కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఖమ్మంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, మణుగూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీ భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు,
మధిరలో ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు, ఇల్లెందులో భద్రాద్రి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఖమ్మంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు తదితర ప్రముఖులు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దారి చూపిన ఆమె వీరత్వాన్ని స్మరించుకున్నారు. కాగా, ఐలమ్మ ధైర్య సాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
-నమస్తే నెట్వర్క్