భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలానికి రైలుమార్గం కలగానే మిగిలిపోతున్నది. భద్రాద్రి రామయ్య వద్దకు ఏటేటా భక్తుల తాకిడి పెరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ కొత్తగూడెం రైల్వేస్టేషన్ (భద్రాచలం రోడ్) వరకు రైలులో వచ్చి అక్కడి నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా భక్తులు భద్రాచలం వెళ్లాల్సి వస్తోంది.
రద్దీకి అనుగుణంగా కొత్త రైళ్లను పెంచాల్సిన కేంద్ర ప్రభుత్వం.. ఉన్న రైళ్లను తగ్గిస్తూ.. బోగీలను కుదిస్తూ భక్తులకు అగ్నిపరీక్ష పెడుతున్నది. అంతేగాక ‘అమృత్ భారత్’ పథకం కింద చేపట్టిన కొత్తగూడెం రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతుండడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. వానొస్తే తలదాచుకోవడానికి కూడా స్థలం లేకుండాపోయింది. ఎక్స్కవేటర్, మెట్ల పనులు సైతం నిలిచిపోవడంతో స్టేషన్‌కు రావాలంటేనే వణికి పోతున్నారు.
కొవిడ్‌కు ముందు కొత్తగూడెం రైల్వేస్టేషన్ (భద్రాచలం రోడ్)కు ప్రయాణికుల రైళ్లు ఏడు నడిచేవి. దీంతో రైలు ప్రయాణం కొంత సులభతరమైంది. కానీ రెండేళ్ల నుంచి పరిస్థితి మారడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. రైల్వే అధికారులు కొవిడ్ సమయంలో కొన్ని రైళ్లను రద్దు చేయగా.. తర్వాత కొన్నింటిని పునరుద్ధరించారు. ప్రస్తుతం సింగరేణి, కాకతీయ, మణుగూరు ఫాస్ట్ ప్యాసింజర్, విజయవాడ ప్యాసింజర్ మాత్రమే నడుస్తున్నాయి.
ఉదయం 5 గంటలకు కాకతీయ, 6 గంటలకు మణుగూరు ఫాస్ట్ ప్యాసింజర్ నడుస్తుండడంతో ఆ తర్వాత ఆయా ప్రాంతాలకు వెళ్లాలంటే ఒక్క రైలు కూడా అందుబాటులో లేకుండాపోయింది. మళ్లీ మధ్యాహ్నం విజయవాడ ప్యాసింజర్ వచ్చేవరకు వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాత్రి కొత్తగూడెం రావడానికి మణుగూరు ఫాస్ట్ ప్యాసింజర్ తప్ప మరో రైలు లేదు. గతంలో ఉదయం 8గంటలకు ప్యాసింజర్, సాయంత్రం 5గంటలకు డోర్నకల్ ప్యాసింజర్, అదే సమయంలో బెల్గాం ఎక్స్‌ప్రెక్స్ రైలు ఉండేది. కానీ, ఇప్పుడు ఆ రైళ్లు రద్దుకావడంతో దూరప్రాంతాలకు వెళ్లే వారికి బస్సు ప్రయాణం తప్పడం లేదు. వృద్ధులు, దివ్యాంగులు బస్సు ప్రయాణం చేయాలంటే నానా ఇబ్బందులు పడుతున్నారు.
అమృత్ భారత్ పథకంలో భాగంగా కొత్తగూడెం రైల్వేస్టేషన్(భద్రాచలం రోడ్) అభివృద్ధి పనుల కోసం రూ.25.41 కోట్ల నిధులు మంజూరయ్యాయి. పనులు ప్రారంభించి రెండేళ్లవుతున్నా ఇప్పటివరకు పూర్తికాలేదు. ప్లాట్‌ఫాంల నిర్మాణంలో భాగంగా బండలు తొలగించడంతో స్టేషన్ మొత్తం అస్తవ్యస్తంగా మారింది.
కనీసం ప్రయాణికులు నిల్చోవడానికి కూడా వీలులేకుండా ఉంది. వర్షం వస్తే స్టేషన్లోకి సమీపంలోని పశువులు, కుక్కలు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెయిటింగ్హాల్ను కూడా మూసివేయడంతో ప్రయాణికులు రైలు వచ్చేవరకు మెట్లపైనే నిద్రించాల్సి వస్తోంది. చివరికి మూత్రశాలలు కూడా లేకపోవడంతో సతమతమవుతున్నారు. రైల్వేశాఖ ఉన్నతాధికారులు ఆరునెలలు, మూడు నెలలకోసారి తనిఖీలకు వచ్చినా పనుల జాప్యంపై పట్టించుకోకపోవడంతో ఆధునీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎందరో పోరాట పటిమ గల నాయకులు భద్రాద్రి జిల్లాలో ఉన్నప్పటికీ పాంగురంగాపురం రైల్వేలైన్ కోసం పోరాటం చేసినా చివరికి భద్రాచలం రామయ్య చెంతకు రైలు మార్గాన్ని సాధించలేకపోయారు. ఆ దిశగా పార్లమెంటు సభ్యులు కూడా కృషి చేయలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఇటీవలికాలంలో కిరండోల్ వరకు భద్రాచలం నుంచి రైల్వేలైన్ మంజూరైనట్లు ప్రకటించినా.. ఆ పనులు కూడా జరగడం లేదు. ప్రస్తుతం ఉన్న నాలుగు రైళ్లతోపాటు తిరుపతి, షిర్డీకి వెళ్లే భక్తులకు కొత్త రైళ్లను అందుబాటులోకి తేవాలని ప్రయాణికులు, భక్తులు కోరుతున్నారు. డోర్నకల్ వరకు ప్యాసింజర్ రైలు నడపడంతోపాటు డబుల్ రైల్వేలైన్ నిర్మాణం చేపడితే ఇక్కడకు కొత్త రైళ్లు వచ్చే అవకాశం ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.
రైల్వే బోర్డు మెంబర్‌గా రైల్వేస్టేషన్ సమస్యలను చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాను.. అయినా స్పందించడం లేదు. రాత్రివేళల్లో ప్రయాణికులు కింద పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. కోట్ల నిధులు మంజూరైనా పనులు నిలిపివేశారా? లేదా ఎందుకు ఆలస్యం చేస్తున్నారనేది అర్థం కావడం లేదు. రైల్వే సమస్యలపై దిశ సమావేశాల్లో ప్రశ్నించినా అప్పటివరకు సమాధానం చెప్పి తప్పించుకుంటున్నారు కానీ, ఎవరూ పరిష్కారం చూపడం లేదు.
– వై.శ్రీనివాసరెడ్డి, రైల్వే అభివృద్ధి సలహా మండలి సభ్యుడు, కొత్తగూడెం
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది కొత్తగూడెం రైల్వేస్టేషన్ పరిస్థితి. పేరుకే నాలుగు రైళ్లు వచ్చి వెళ్తాయి. మణుగూరు ఫాస్ట్ ప్యాసింజర్‌కు సీట్లు దొరకవు. ఈ రైలుకు బోగీలు పెంచాల్సిన అవసరం ఉంది. సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్‌కు కూడా స్లీపర్ కోచ్‌లు ఏర్పాటు చేయాలి. ఈ కోచ్‌లు లేకపోవడంతో దూరప్రాంతాలకు వెళ్లే వారు ఇబ్బంది పడుతున్నారు. కొత్తగూడెం నుంచి తిరుపతి, షిర్డీ వెళ్లే వారికి రైళ్లు లేకపోవడంతో బస్సులు లేదా ప్రైవేటు వాహనాల్లో వెళ్లాల్సి వస్తోంది. ఇది చాలా దారుణం.
– పయ్యావుల రామ్మూర్తి, ప్రయాణికుడు, కొత్తగూడెం
రైలు కోసం గంట ముందు రైల్వేస్టేషన్‌కు వెళ్తే కూర్చోవడానికి కూడా జాగలేదు. స్టేషన్లో కుక్కలు తిరుగుతున్నాయి. కోతులు ఇబ్బంది పెడుతున్నాయి. ఫ్యాన్లు ఉన్నచోట్ల బల్లాలు లేవు. బల్లలు ఉన్నచోట ఫ్యాన్లు ఉండవు. బాత్రూంలు ఎక్కడో దూరంగా ఉన్నాయి. పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదు. బేతంపూడి రైల్వేస్టేషన్లో ఉన్న సౌకర్యాలు కూడా ఇక్కడ లేవు.
– అచ్చన పద్మావతి, ప్రయాణికురాలు, కొత్తగూడెం