కొత్తగూడెం అర్బన్, ఫిబ్రవరి 19: వీధి వ్యాపారులకు, చిరు వ్యాపారులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు తీసుకొచ్చిన ‘పీఎం స్వనిధి’ పథకానికి కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలికినట్లుగా కనిపిస్తున్నది. వెబ్సైట్ నిలిపివేతతో స్ట్రీట్ వెండర్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో వీధి వ్యాపారుల రుణాలకు కేంద్ర ప్రభుత్వం బ్రేక్ వేసిందనే ప్రచారం జరుగుతున్నది మరోవైపు వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులు కలిసి రుణాల కోసం రోజుల తరబడి మెప్మా కార్యాలయాల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. వీధుల వెంట, రహదారుల పక్కన వ్యాపారులు చేసుకుంటూ జీవించే వీధి వ్యాపారులను, చిరు వ్యాపారులను కరోనా లాక్డౌన్ కోలుకోలేని దెబ్బతీసింది.
ఆ సమయంలో వ్యాపారాలు నిర్వహించుకునే అవకాశం లేక వారి బతుకులు రోడ్డున పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో వీరికి ఆర్థిక చేయూతనందించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఆ చిరు వ్యాపారాలను సజావుగా నిర్వహించుకునేందుకు వారికి ఇతోధికంగా రుణాలను మంజూరు చేసే పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి (పీఎం స్వనిధి) పథకాన్ని తీసుకొచ్చింది. దశలవారీగా రుణాలను అందించే కార్యాచరణ చేపట్టింది. మొదటి విడతలో రూ.10 వేలు, రెండో విడతలో రూ.20 వేలు, మూడో విడతలో రూ.50 వేల చొప్పున రుణాలు అందించేందుకు నిర్ణయించింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) రిసోర్స్ పర్సన్ల ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలైన కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరుల్లో సర్వే నిర్వహించింది. అర్హులకు రుణాలివ్వాలని బ్యాంకులను ఆదేశించింది. అప్పట్లోనే తొలి విడతల్లో కొందరు అర్హులు రుణాలు పొందారు. వాటిని సక్రమంగా చెల్లిస్తున్నారు.
పథకానికి బ్రేక్!
ప్రస్తుతం పీఎం స్వనిధి పథకానికి కేంద్ర ప్రభుత్వం బ్రేక్ వేసినట్లు కనిపిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అందించే ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే వీధి, చిరు వ్యాపారులకు ఎటువంటి సమాచారం లేకుండానే కేంద్రం నిలిపివేయడంతో అర్హులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలి విడతల్లో పొందిన రుణాలను సక్రమంగా చెల్లించిన వారు తదుపరి రుణాలు పొందేందుకు ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. అలాగే, కొత్తగా రుణాలు పొందాలనుకునే వారి ఆశలు ఆవిరయ్యాయి. తమకు మలి విడత రుణాలు మంజూరు చేయాలంటూ వీధి వ్యాపారులు బ్యాంకుల వద్దకు, అధికారుల వద్దకు వెళ్లినా ఫలితం కన్పించడం లేదు. తమ చేతుల్లో ఏమీ లేదని, కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్ను నిలిపివేసిందని సమాధానం చెబుతున్నారు. దీంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇబ్బందులు పడుతున్న అర్హులు
ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ రోడ్ల వెంట వ్యాపారం చేసుకొని కుటుంబాలకు వెళ్లదీస్తున్న తమకు కేంద్రం రుణాలను నిలిపివేయడంతో తాము మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తున్నదని వీధి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. కూరగాయలు, పూలు, పండ్లు, గాజులు, ఫ్యాన్సీ వస్తువులు విక్రయించుకుంటూ బతికే తాము.. ఇదివరకు తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లిస్తున్నప్పటికీ కేంద్రం ఈ పథకాన్ని ఎందుకు నిలిపివేసిందో అర్థం కావడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదటి విడతగా కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, ఇల్లెందు మున్సిపాలిటీల్లో మొదటి విడత రూ.10 వేల రుణాల కోసం సుమారు 15,028 మంది దరఖాస్తు చేసుకోగా.. 11,552 మందికి మంజూరయ్యాయి. రెండో విడత రూ.20 వేల రుణాల కోసం 6,667 మంది అర్హత సాధించగా.. 5,740 మందికి మంజూరు చేశారు. మూడో విడత రూ.50 వేల రుణాల కోసం 2,314 మంది అర్హత సాధించగా.. 1,878 మందికి మంజూరు చేశారు. ఈ రుణాలు పొందినవారిలో అత్యధికులు మహిళలే కావడం విశేషం.
రుణం కోసం వచ్చాను..
వీధి వ్యాపారులకు ఇచ్చే రుణం కోసం కార్యాలయానికి వచ్చాను. మొదటి విడత రుణం తీసుకొని సకాలంలో చెల్లించాను. రెండో విడత రుణం దరఖాస్తు చేసుకుందామంటే వెబ్సైట్ పనిచేయడం లేదని అధికారులు చెప్పారు. ఈ రుణం లభిస్తేనే వ్యాపారం చేసుకోగలను. లేదంటే అధిక వడ్డీ అయినా మళ్లీ వ్యాపారులను ఆశ్రయించకతప్పదు.
-ధను, చిరు వ్యాపారి
వెబ్సైట్ను అప్డేట్ చేస్తున్నారు..
పీఎం స్వనిధి వెబ్సైట్ను అప్డేట్ చేస్తున్నారు. అందుకే ఈ రుణాల పంపిణీకి బ్రేక్ పడింది. గత సంవత్సరం డిసెంబర్ 31న ఈ వెబ్సైట్ను నిలిపివేశారు. వీధి వ్యాపారులకు రుణాల పరిమితిని పెంచుతున్నట్లు కేంద్రం ఇటీవల ప్రకటించింది. వెబ్సైట్ను అప్డేట్ చేసిన తర్వాత అర్హతలను చిరు వ్యాపారులకు రుణాలను ఇస్తాం.
-శేషాంజన్స్వామి, మున్సిపల్ కమిషనర్, కొత్తగూడెం