ఖమ్మం రూరల్, నవంబర్ 18 : పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ గుర్రం అచ్చయ్య అన్నారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెం గ్రామంలో ఏఐయుకేఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మళ్లీది నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సమ్మె చేస్తూ పత్తి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు, 8 శాతం తేమ పేరుతో పత్తి రైతాంగాన్ని తీవ్ర అవస్థలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. మొంథా తుఫాను వల్ల పత్తి దిగుబడి రాక రైతులు తీవ్రంగా నష్ట పోయినట్లు తెలిపారు. తుఫాన్ వల్ల నష్టపోయిన పత్తిని, సిసిఐ తేమ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తుందని, తడిసిన పత్తిని కూడా సిసిఐ సరైన రేటు ఇచ్చి కొనుగోలు చేయాలన్నారు.
రైతులు ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నప్పుడే పత్తిని కొనుగోలు చేస్తామని సిసిఐ అనడం పత్తి రైతాంగాన్ని నష్టాల్లోకి దిగజార్చే ప్రయత్నం చేస్తుందని ఆయన విమర్శించారు. పత్తి క్వింటాలకు రూ.10,500 మద్దతు ధర ఇవ్వాలని, ఎకరానికి నష్ట పరిహారంగా రూ.50 వేలు ఇవ్వాలని కోరారు. జిన్నింగ్ మిల్లర్లతో సిసిఐ, ప్రభుత్వాలు కుమ్మక్కై పత్తి రైతులను ఇబ్బందులకు గురి చేయడాన్ని విరమించుకోవాలన్నారు. అలాగే ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తి నిబంధనను ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్‌లైన్ పాలేరు డివిజన్ కార్యదర్శి బందెల వెంకయ్య. ఏఐపీకే ఎంఎస్ జిల్లా అధ్యక్షుడు రేపాకుల శివలింగం. జిల్లా కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు. ఏఐయుకేఎస్ పాలేరు డివిజన్ కార్యదర్శి కుర్ర వెంకన్నా, దొండేటి సత్యమయ్య, వీర్ల వెంకట అప్పారావు, తోకల ఉపేందర్, గోసు పుల్లయ్య, రెంటాల సీతారాములు, తోకల పెద వెంకన్న, తోకల చిన్న వెంకన్న పాల్గొన్నారు.