జూలూరుపాడు, నవంబర్ 19: ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు దీటుగా పత్తి కొనుగోళ్లు చేపడుతున్న జూలూరుపాడు సబ్ మార్కెట్లో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనివల్ల ఈ ప్రాంత పత్తి రైతులకు ఎంతో మేలు జరుతుందని అన్నారు. జూలూరుపాడు మండలానికి బుధవారం వచ్చిన ఆయన.. స్థానిక బీఆర్ఎస్ నేతలైన యల్లంకి సత్యనారాయణ, లకావత్ గిరిబాబు తదితరులతో కలిసి జూలూరుపాడు సబ్ మార్కెట్ యార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వద్దిరాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. చేతికొచ్చిన పంటకు కుడా గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు.
రూ.6 వేల లోపే ధర పెట్టడం దారుణం..
జూలూరుపాడు యార్డుకు రైతులు తెచ్చిన పత్తికి వ్యాపారులు మరీ తక్కువ ధర పెడుతున్నారని ఎంపీ వద్దిరాజు అన్నారు. సీసీఐ మద్దతు ధర రూ.8,110 ఉన్నప్పటికీ వ్యాపారులు మాత్రం క్వింటాకు రూ.5 వేల నుంచి రూ.6 వేల మధ్యే వెచ్చిస్తుండడం దారుణమని అన్నారు. మద్దతు ధరకు కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. గిట్టుబాటు ధర కల్పించే వరకూ రైతుల పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు యదళ్లపల్లి వీరభద్రం, చేపలమడుగు రామ్మూర్తి, లకావత్ హేమ్లా, రెడ్డిబోయిన రాము, రామారావు, రామకృష్ణ, వెంకన్న, శంకర్, ప్రకాశ్, శేషయ్య, సత్యనారాయణ, తిరుపతి, పుల్లయ్య, భోజ్యా పాల్గొన్నారు.