పదిమందికి అన్నం పెట్టే రైతన్నకు ఒకటే ఆశ ‘పంట బాగా పండాలి’. అయితే మంచి ఆలోచన కూడా ఉన్నప్పుడే అది నెరవేరుతుంది. అంతేకాదు.. అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలను ఆచరించినప్పుడే సాగులో సంపూర్ణ విజయం సాధ్యమవుతుంది. అనుకున్న దానికంటే ఎక్కువ దిగుబడులు సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా వానకాలం సీజన్ ప్రారంభంలోనే రైతులు అప్రమత్తంగా ఉండి సాగు మొదలుపెట్టాలి. ఏదో ఒక విత్తనాలు కొని ఎచ్చిపచ్చి దుక్కిలో వేసుకుంటే అవి మొలకలు రాక అదును దాటిపోయి ఆ ఏడాది వ్యవసాయమే ప్రశ్నార్థకం కావచ్చు. అందుకే అన్నదాత ఆగంకావొద్దు.. జర ఆలోచించి ముందుకు‘సాగాలి’.
– ఖమ్మం వ్యవసాయం, మే 19
ఆవిటి మొదటినుంచే విత్తన, పంట ప్రణాళికను సిద్ధం చేసుకొని సాగు పనులు చేపడితే అన్నదాతలు ఆశించిన మేర దిగుబడులు సాధించవచ్చు. పొడి దుక్కిలో విత్తనాలు విత్తుకొని ఆగంకావద్దనే ఉద్దేశంతోనే అధికారులు విత్తనాల విక్రయాలకు ‘స్టాప్ సేల్’ ప్రకటించారు. గ్రామగ్రామాన వ్యవసాయశాఖ అధికారులు అందుబాటులో ఉన్నారు. అవసరమైన విత్తనాలను ప్రభుత్వం సొసైటీల ద్వారా పంపిణీ చేయనుంది. సాగుకు అవసరమైన వాణిజ్య పంటల విత్తనాలను సైతం అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు. సమృద్ధిగా వర్షాలు పడి అవసరమైన మేర తేమశాతం నమోదయ్యాక విత్తనాలు విత్తుకుంటే పైరు ఏపుగా పెరిగే అవకాశం ఉంది.
వరికొయ్యలను పొలాల్లో కాల్చడం ద్వారా అనేక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు రైతులకు సూచిస్తున్నారు. ఒకటన్ను వరిగడ్డి కాల్చడం వల్ల 5.5 కిలోల నత్రజని, 2.3 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాషియంతోపాటు 12కిలోల సల్ఫర్తోపాటు సేంద్రియ కార్బన్ సైతం కోల్పోయే ప్రమాదముందని చెబుతున్నారు. పంట అవశేషాలను నేలలో చేర్చినైట్లెతే నేలకు సేంద్రియ కార్బన్, నత్రజని అంది నేల సారవంతంగా మారుతుంది. మండే అవశేషాల నుంచి వచ్చే వేడి నేలలో ఉష్ణోగ్రతను పెంచుతుంది. దీనివలన ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు మరణిస్తాయి. నేల ఆరోగ్యం కాపాడాలంటే అవశేషాలను కాల్చేయడం సరికాదు.
భూసారాన్ని బట్టి పంటల సాగు చేపడితే అధిక దిగుబడులు పొందడమే కాకుండా భూమిలోని పోషకాలు చాలాకాలం పంటలకు అందే అవకాశం ఉంటుంది. దీంతో మంచి ఫలితాలు వచ్చి రైతులు ఆర్థికంగా బలపడే అవకాశం ఉంటుంది. వేసవిలో పంటలు పూర్తిగా చేతికి వచ్చిన తర్వాత రైతు తన పంటపొలంలో వ్యవసాయశాఖ అధికారి సూచనల మేరకు భూసార పరీక్షలు చేయించాలి. దాని ఫలితం ఆధారంగా తదుపరి మూడేళ్లపాటు సాగు చేసుకోవచ్చు.
విత్తనాలు కొనుగోలు చేసే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. కేవలం అధీకృత డీలర్ షాపులో మాత్రమే కొనుగోలు చేయాలి. అనధికార వ్యక్తుల నుంచి కొనుగోలు చేయరాదు. విత్తనాలు కొనుగోలు చేసిన తరువాత బిల్లు (రసీదు) తప్పనిసరిగా తీసుకోవాలి. బిల్లులో విత్తనం లాట్ నెంబర్, ముగింపు కాలపరిమితి వివరాలు చూసుకోవాలి. బిల్లుపై రైతు సంతకంతోపాటు అధీకృత డీలర్ సంతకం ఉండాలి. పంటకాలం ముగిసేవరకు విత్తన ప్యాకెట్, రసీదు భద్రంగా దాచిపెట్టుకోవాలి. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు. ఏయే రకం విత్తనాలు కొనుగోలు చేయలో స్థానిక ఏఈవో, ఏవో సలహాలు తీసుకుంటే మరింత మంచిది.
పత్తి విత్తనాలు నాటుకునే సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. రుతుపవనాలు ప్రవేశించిన తరువాత విస్తారంగా వర్షాలు పడి కనీసం 60-70 శాతం తేమ ఉంటేనే విత్తుకోవాలి. పత్తి సాగుకు ఎర్ర, నల్లరేగడి భూములు మాత్రమే అనుకూలం. ఎర్రనేలలో 50-60 శాతం, నల్లరేగడి భూముల్లో 60-70 శాతం తేమ తప్పనిసరి. ఒకటి రెండు తేలికపాటి వర్షాలకు విత్తుకోవడం సరికాదు. నల్లరేగడి భూముల్లో వర్షాధారంగా సాగు చేస్తే త్వరగా పూత, కాత వచ్చే హైబ్రీడ్ రకాల విత్తనాలను విత్తుకోవాలి.
వానకాలం సీజన్లో మక్కసాగు లేకపోవడం, మార్కెట్లో పప్పులకు రికార్డు స్థాయి ధరలు పలుకుతుండడంతో ఈ ఏడాది జిల్లాలో అపరాల సాగు మరింత పెరిగే అవకాశం ఉంది. జూన్ 15 నుంచి జూలై 15 వరకు పెసలు విత్తుకోవచ్చు. ఎంజీజీ-295, 347, డబ్ల్యూజీజీ-237 వంటి రకాలు అనుకూలంగా ఉన్నాయి. జూలై 15లోపు కంది విత్తనాలు నాటుకునేందుకు అనుకూల సమయం. పెసర, కంది పంటలు పత్తిపంటలో అంతరపంటగానూ సాగు చేసుకోవచ్చు. జూన్ 15 నుంచి జూలై 15 వరకు మినుములు విత్తుకోవచ్చు.
మరికొద్దిరోజుల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉంది. సాగుకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులు అవగాహన కలిగి ఉండాలి. పంటపొలాల్లో ఎట్టి పరిస్థితిలో వరికొయ్యలు తగులబెట్టవద్దు. పొడిదుక్కుల్లో విత్తనాలు వేయవద్దు. గ్రామాల్లో ఎవరైనా విత్తనాలు విక్రయిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలి. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలతోనే రైతులు సాగుకు శ్రీకారం చుట్టాలి.
– ఎం.విజయనిర్మల, డీఏవో, ఖమ్మం