ఖమ్మం రూరల్, ఏప్రిల్ 22 : మండలంలోని ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం ప్రొబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. గుర్రాలపాడు సమీపంలోని వినాయక గ్రానైట్ ఫ్యాక్టరీ వెనుక భాగంలో నివాసం ఉంటున్న కూలీల ఇండ్ల సముదాయాల్లో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బి.చంద్రమోహన్ ఆధ్వర్యంలో ముమ్మర సోదాలు చేశారు.
ఈ క్రమంలో బానోతు హరియా అనే వ్యక్తి ఇంట్లో నిర్వహించిన సోదాల్లో 5.80 కేజీల గంజాయి చాక్లెట్లను పట్టుకున్నట్లు తెలిపారు. తక్కువ ధరకు ఒడిశా నుంచి కొనుగోలు చేసి ఈ ప్రాంతంలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. చాక్లెట్లను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ సోదాల్లో ఎక్సైజ్ శాఖ సిబ్బంది ఆర్.సురేంద్ర కుమార్, ఎస్.కె మౌలాకర్, బి.గురుప్రసాద్, బి.నరసింహ, బి.భద్రమ్మ పాల్గొన్నారు.
Khammam Rural : గుర్రాలపాడులో గంజాయి చాక్లెట్లు పట్టివేత