కారేపల్లి, అక్టోబర్ 13 : విద్యుదాఘాతంతో దుక్కిటేడ్లు మృత్యువాతకు గురైన సంఘటన సోమవారం ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలం తొడిదలగూడెంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైతు శ్యామలాల్ సాహు తన వ్యవసాయ చేనులో ఉన్న విద్యుత్ స్తంభానికి ఎడ్లను కట్టివేశాడు. ఆదివారం రాత్రి భారీ వర్షం కురవడంతో నేలంతా తడిసింది. దీంతో విద్యుత్ స్తంభానికి ఉన్న సపోర్టు వైర్‌కు కరెంట్ సరఫరా కావడంతో దుక్కిటెడ్లు చనిపోయినట్లు రైతు కుటుంబం కన్నీటి పర్వంతమైంది. వ్యవసాయానికి ఉపయోగపడే ఎడ్లు మృతి చెందడంతో రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు ప్రభుత్వాన్ని కోరారు.