కారేపల్లి, జూలై 09 : బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నేతగా నియమితులైన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌తో కలిసి సింగరేణి మండల నాయకులు గురువారం సన్మానించారు. ఈ సందర్భంగా తాతా మధుసూదన్ మాట్లాడుతూ… పార్లమెంటులో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, రాష్ట్ర హక్కులు, అభివృద్ధి అంశాలను మరింత బలంగా వినిపిస్తూ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో వద్దిరాజు రవిచంద్ర సమర్థవంతమైన పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, పార్లమెంట్ వేదికగా తెలంగాణ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేస్తారని ఆకాంక్షించారు. వద్దిరాజు రవిచంద్ర నియామకం ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ శ్రేణులకు మరింత ఉత్సాహాన్ని నింపిందని, పార్టీ బలోపేతానికి కొత్త ఊపు తీసుకు వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, కొత్తతండా గ్రామ పంచాయతీ సర్పంచ్ ధరావత్ మంగీలాల్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు ముత్యాల వెంకట అప్పారావు, బానోతు రాందాస్, పండిత్య నాయక్ పాల్గొన్నారు.