కొత్తగూడెం టౌన్/ ఇల్లెందు/ లక్ష్మీదేవిపల్లి/ రామవరం/ పాల్వంచ, డిసెంబర్ 2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బీఆర్ఎస్ నేతలను పోలీసులు నిర్బంధించారు. మంగళవారం పొద్దుపొద్దున్నే ఉదయం 5 గంటలకే నేతల ఇండ్లలోకి చొరబడి అక్రమంగా అరెస్టు చేసి ఆయా పోలీస్స్టేషన్లకు తరలించారు. జిల్లాకేంద్రం కొత్తగూడెం పట్టణంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు ప్రతిపక్ష నేతలను ముందస్తు అరెస్టులు చేశారు. కొత్తగూడెం మండలంలో పలువురు బీఆర్ఎస్ నాయకులతోపాటు ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ రాజేష్ నాయక్‌ను, రామవరంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు.
ఇల్లెందు పట్టణంలో బీఆర్ఎస్ సీనియర్ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, సీనియర్ నాయకుడు సిలివేరి సత్యనారాయణ, ఇల్లెందు పట్టణ పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ జబ్బార్, ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్ జేకే శ్రీను, నాయకులు గిన్నారపు రాజేష్, సత్తాల హరికృష్ణ, కాసాని హరిప్రసాద్, చాంద్‌పాషా, కొండ్రు రవికాంత్, వార రమేష్, మీర్జాబేగ్ తదితర ముఖ్య నాయకులను ఇల్లెందు పోలీసుస్టేషన్‌కు తరలించారు. లక్ష్మీదేవిపల్లి మండల పార్టీ అధ్యక్షుడు కొట్టి వెంకటేశ్వర్లును పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
తమ నేతలను అక్రమంగా అరెస్టులు చేయడంతో పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆరు గ్యారెంటీలను అమలు చేయడం చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ ప్రశ్నిస్తారోనని ముందస్తుగా అరెస్టులు చేశారని అన్నారు. ప్రజాపాలన అంటే.. ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనా అని ప్రశ్నించారు. తమ నాయకుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని, అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని పేర్కొన్నారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తే జీర్ణించుకోలేకపోతున్నారని, ప్రశ్నించిన వారిపై కక్షతో అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
ఈ రాక్షస పాలనకు అంతంపలికే రోజు దగ్గరలోనే ఉందని, బీఆర్ఎస్ నాయకులను బేరషతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దిండిగాల రాజేందర్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఎలా పర్యటిస్తారని ప్రశ్నించారు. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి బానోత్ హరిప్రియనాయక్ మాట్లాడుతూ సీఎం పర్యటనతో ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఒంటెద్దు పోకడలను ప్రశ్నిస్తారని భయంతో పార్టీ శ్రేణులను అరెస్టు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. నిర్బంధాలతో పాలన సాగించలేరని, అక్రమ అరెస్టులు పక్కనపెట్టి పాలనపై దృష్టిపెట్టాలని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి హితవుపలికారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ సీఎం కొత్తగూడెంలో పర్యటించారని, ఇందిరమ్మ చీరెలు కట్టుకొని సభకు రావాలని చెప్పడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు.