ఖమ్మం, జనవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పోరాటాల పురిటిగడ్డ ఖమ్మం గుమ్మంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తొలిసభ దద్దరిల్లింది. ఖమ్మం శివారులోని వీ వెంకటాయపాలెంలోని కలెక్టరేట్ వెనుక సిద్ధం చేసిన 100 ఎకరాల ప్రాంగణం బుధవారం అశేష జనవాహినితో కిక్కిరిసింది. ఇసుకేస్తే కిందకు రాలనంత జనంతో కిటకిటలాడింది. సీఎం కేసీఆర్ సభకు వచ్చిన జనాన్ని చూసి అబ్బురపడ్డారు. కేవలం 10 రోజుల వ్యవధిలో లక్షలాది మంది ప్రజలు తరలివచ్చేలా కృషి చేసిన బీఆర్ఎస్ నేతల పనితీరు అతిథులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 3:30కు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌తో పాటు ముఖ్యమంత్రులు విజయన్, కేజ్రీవాల్, భగవంత్ మాన్ సభా వేదికపైకి వచ్చే వరకు సభికులు ఎంతో ఓపికతో ఎదురుచూశారు. నడినెత్తిన ఎండ మండుతున్నా సహనంతో వేచి ఉన్నారు. మొత్తానికి బీఆర్ఎస్ మొట్టమొదటి సభ చరిత్రలో అరుదైన అద్భుతాన్ని ఆవిష్కరించింది.
ప్రసంగాలకు విశేష స్పందన..
ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ఇతర అతిథులు బహిరంగ సభా స్థలికి చేరుకోకముందే సభ ప్రాంగణం జనంతో నిండిపోయింది. కొన్ని ప్రధాన మార్గాల్లో వాహనాలు నిలిచిపోవడంతో ఇంకా వేలాదిమంది ప్రజలు ప్రధాన రహదారులపైనే ఉండిపోయారు. పార్టీ అధినేత ప్రసంగం మొదలైన తర్వాత సభకు విచ్చేసిన ప్రజల ఉత్సాహం రెట్టింపైంది. ఖమ్మం జిల్లాపై వరాల జల్లు కురిపిస్తున్న సమయంలో సభికుల కరతాళ ధ్వనులు, హర్షధ్వానాలు మిన్నంటాయి. ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు, జాతీయ పార్టీ నేతలు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ప్రసంగాలకు అనూహ్య స్పందన లభించింది. కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి, మెడికల్ కళాశాల శంకుస్థాపన మహోత్సవానికి సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క హాజరుకావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలో బీజేపీ మినహా అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు పాల్గొన్నట్లయింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై సీఎం కేసీఆర్ ఆప్యాయంగా చెయ్యివేసి మిగతా సీఎంలకు పరిచయం చేశారు.
కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి
మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి విచ్చేయడంతో ఉమ్మడి జిల్లా నుంచి కార్యక్రమాలకు హాజరైన బీఆర్ఎస్ ముఖ్యనేతల సంఖ్య సంపూర్ణమైంది.
సభకు రాష్ట్ర నలుమూలల నుంచి..
సభకు ఖమ్మం నుంచే కాక అశ్వారావుపేట, సత్తుపల్లి, మధిర, వైరా, పినపాక, పాలేరు, ఇల్లెందు, మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి, భద్రాచలం, కొత్తగూడెం, సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి, హుజూర్నగర్ నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎండను సైతం లెక్కచేయకుండా ముఖ్యమంత్రుల ప్రసంగం కోసం నేతల సందేశం కోసం గంటల తరబడి ఓపికగా నిరీక్షించారు. ఖమ్మం నగరం నుంచి బహిరంగ సభా స్థలి వరకు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులకు స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరోవైపు బీఆర్ఎస్ బహిరంగ సభకు లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నగరం నుంచి 1000 వలంటీర్లను ఏర్పాటు చేశారు.
బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ప్రాధాన్యతను గ్రామగ్రామాన, వీధివీధినా తెలిసే విధంగా జిల్లాలో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు, ఇల్లెందు శాసనసభ్యురాలు హరిప్రియానాయక్, వైరా శాసనసభ్యుడు లావుడ్యా రాములు నాయక్, కొత్తగూడెం శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు, అశ్వారావుపేట శాసనసభ్యుడు మెచ్చా నాగేశ్వరరావు, భద్రాచలం పార్టీ బాధ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చేలా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గాలకు పార్టీ నియమించిన ఇన్‌చార్జ్‌లు సైతం నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని సభలో జనప్రవాహం ఉప్పొంగేలా ఊతమిచ్చారు.
ఈ సభకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సభ 100 ఎకరాల సువిశాల స్థలంలో జరుగగా, పార్కింగ్ కోసం పోలీసులు రిజర్వు చేసిన స్థలాలను వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మధ్యాహ్నం 1 గంట వరకే అన్ని పార్కింగ్ స్థలాలు వాహనాలతో కిటకిటలాడాయి. సభకు మహిళలు సైతం పెద్ద ఎత్తున హాజరుకావడం విశేషం. దివ్యాంగులు, వృద్ధులు, సీనియర్ సిటిజన్లు, విశ్రాంత అధికారులు, ఉద్యోగులు సైతం ఎండను లెక్క చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాన్ని ఆసాంతం విన్నారు. వేదికపై సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు ఆసీనులయ్యారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి సైతం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు హాజరయ్యారు. బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సభావేదికపై ఆశీనులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరువూరు, నందిగామ, నూజివీడు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, జగ్గయ్యపేట, మైలవరం, గుడివాడ వంటి ప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా భారీగా ప్రజలు హాజరయ్యారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి సైతం బీఆర్ఎస్ అభిమానులు ముఖ్యమంత్రుల ప్రసంగం వినేందుకు శ్రమకోర్చి వచ్చారు.
దేశ రాజకీయాల్లో పెనుమార్పులు..
బీఆర్ఎస్ సభలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగం జాతీయ రాజకీయాల్లో పెనుమార్పులు సృష్టించే రీతిలో ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. పంజాబ్, కేరళ, ఢిల్లీ ముఖ్యమంత్రులు భగవంత్ మాన్, పినరాయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా వంటి బీజేపీయేతర, కాంగ్రెసేతర అతిరథ మహారథులు ఏకతాటిపైకి వచ్చి సరికొత్త రాజకీయాలకు నాంది పలకడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ సభ నుంచే జాతీయ రాజకీయాల్లో కీలక మలుపులు జరుగుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తుమ్మల..
మంత్రి పువ్వాడకు అభినందనలు
నాడు మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపారని, నేడు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అంతటి అభివృద్ధి చేస్తున్నారని సీఎం కేసీఆర్ సభావేదికగా ప్రశంసించారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వారం రోజులుగా ఖమ్మంలోనే మకాం వేసి సభ, కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేశారనే అభిప్రాయం కార్యకర్తలు, పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్నది. అలాగే సభ సన్నాహక సమావేశాలూ కలిసి వచ్చాయని భావిస్తున్నాయి.