ఖమ్మం, మే 16: గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన అభివృద్ధిని, అందించిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవడమే లక్ష్యంగా సోషల్ మీడియా వారియర్స్ పనిచేయాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు సూచించారు. వరంగల్ – నల్గొండ – ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ నెల 27న జరుగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల రాకేశ్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించడంలో సోషల్ మీడియా వారియర్ల బాధ్యత గురుతరమైనదిగా ఉండాలని అన్నారు. బ్యాలెట్ పేపర్లోని మూడో క్రమ సంఖ్యలో రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్లను ఆయన కోరారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన ఉన్నత విద్యావంతుడు రాకేశ్‌రెడ్డి అని అన్నారు. సేవ చేయాలనే ఉన్నత ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయనను ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. యువతలోనూ, విద్యావంతుల్లోనూ మంచి పట్టు ఉండడంతో ఆయనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా తమ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారని వివరించారు.