తిరుమలాయపాలెం, జనవరి 20 : బెంగుళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తాతా నిఖిల్‌చౌదరి(25) అంత్యక్రియలు శుక్రవారం పిండిప్రోలు గ్రామంలో జరిగాయి. నిఖిల్ ఎమ్మెల్సీ తాతా మధు సోదరుడు విశ్వేశ్వరావు కుమారుడు కావడంతో జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. మహబూబాబాద్ ఎంపీ కవిత, పాలేరు, సత్తుపల్లి, ఇల్లెందు, వైరా ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, హరిప్రియానాయక్, రాములునాయక్, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, మదన్‌సింగ్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఖమ్మం కార్పొరేషన్ చైర్మన్ నీరజ, హరిసింగ్‌నాయక్ పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా టీఆర్ఎస్ నాయకులు నిఖిల్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. ఎమ్మెల్సీ తాతా మధు, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
నిఖిల్ మృతదేహాన్ని ఊరేగింపుగా వ్యవసాయ క్షేత్రం వరకు తీసుకెళ్లి దహనసంస్కారాలు పూర్తిచేశారు. విశ్వేశ్వరావు తన కుమారుడి చితికి నిప్పంటించారు. ఏకైక కుమారుడు నిఖిల్ మృతిచెందడంతో తల్లిదండ్రులు విశ్వేశ్వరావు-నాగమణి, ఎమ్మెల్సీ తాతా మధు దుఃఖసాగరంలో మునిగిపోయారు. వారిని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఓదార్చి ధైర్యం చెప్పారు. అంతిమయాత్రలో ఎంపీపీ బోడ మంగీలాల్, తిరుమలాయపాలెం సొసైటీ చైర్మన్ చావా వేణు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ చావా శివరామకృష్ణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాషబోయిన వీరన్న, ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, ఇల్లెందు మున్సిపల్ కౌన్సిలర్లు ఎస్డీ ఆజాం, అంకెపాక నవీన్‌కుమార్, పలువురు నాయకులు పాల్గొన్నారు.