బీఆర్ఎస్ అధిష్ఠానం సోమవారం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ ప్రకటన గులాబీ శ్రేణుల్లో జోష్ నింపింది. వారిలో సరికొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. నాయకులు, కార్యకర్తలు కేరింతలు కొడుతూ ప్రధాన కూడళ్లలో రంగులు చల్లుకున్నారు. బాణసంచా కాలుస్తూ.. స్వీట్లు పంచుకుంటూ సందడి చేశారు.. ‘జై కేసీఆర్.. జైజై కేసీఆర్’ అంటూ నినాదాలు చేశారు. ‘గులాబీ’ హ్యాట్రిక్ విజయం ఖాయమంటూ ర్యాలీలు నిర్వహించారు. టికెట్ దక్కించుకున్న వారికి అభిమానులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపి సంతోషాన్ని పంచుకున్నారు. దీంతో పది నియోజకవర్గ కేంద్రాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది.
– నమస్తే నెట్వర్క్
ఇల్లెందు
ఇల్లెందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి: బానోత్ హరిప్రియ
పుట్టినతేదీ: 1 మే 1985
జన్మస్థలం: కొత్తగూడెం జిల్లాకేంద్రం
తల్లిదండ్రులు: సీతారాం, ధర్జన్
భర్త: బానోత్ హరిసింగ్
సంతానం: రుద్రభారతి ప్రియ
విద్యార్హతలు: ఎంటెక్ (సీఎస్ఈ)
రాజకీయ నేపథ్యం: భర్త హరిసింగ్ తొలిరోజుల్లో టీడీపీలో పనిచేశారు. ఆయన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఆమె భర్త వెంటే నడిచారు. 2014లో ఇల్లెందు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆమె ఐదేళ్ల పాటు టీడీపీ ఇల్లెందు నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. సమాంతరంగా హైదరాబాద్‌తోపాటు పలు చోట్ల ఉన్న తమ విద్యాసంస్థలను నడిపించారు. విద్యావేత్తగా పేర్గాంచారు. 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇల్లెందు ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు సాధించి ఎన్నికల్లో గెలిచారు. తాజాగా బీఆర్ఎస్ అధిష్ఠానం ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో స్థానాన్ని సంపాదించారు. ఇల్లెందు నుంచి ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం
కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి: వనమా వెంకటేశ్వరరావు
పుట్టిన తేదీ: 1 నవంబర్ 1945
జన్మస్థలం: పాత పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం
తల్లిదం డ్రులు: నాగభూషణం, అన్నపూర్ణ
భార్య: పద్మావతి
కుమారులు, కుమార్తెలు: రాఘవేంద్రరావు, రామకృష్ణ, అరుణ, విజయ
చదువు: ఎస్ఎస్ఎల్సీ
రాజకీయ నేపథ్యం: వనమా వెంకటేశ్వరరావుకు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. 1971లో కాంగ్రెస్ పార్టీలో చేరి అనేక పదవులు అలంకరించారు. అనేకసార్లు పాల్వంచ సర్పంచ్‌గా గెలిచి సేవలు అందించారు. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన 1989, 2004, 2009 ఎమ్మెల్యేగా గెలిచారు. 2008, 2009లో నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్లో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. 2010, 2014లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2018 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జలగం వెంకటరావుపై విజయం సాధించారు. అనంతరం ఎమ్మెల్యే వనమా బీఆర్ఎస్లో చేరారు.
పాలేరు
పాలేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి: కందాళ ఉపేందర్‌రెడ్డి
పుట్టిన తేదీ: 9 జనవరి 1960
జన్మస్థలం: రాజుపేట, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా
తల్లిదండ్రులు: కందాళ నర్సింహారెడ్డి, మోహినీదేవి
భార్య: కందాళ విజయమ్మ
కుమార్తెలు: దీపిక, దీప్తి
చదువు: బీఎస్సీ
కుటుంబ నేపథ్యం: తండ్రి నర్సింహారెడ్డి, మోహినీదేవి కాంగ్రెస్ పార్టీ నాయకులు. తండ్రి నాడు సర్పంచ్‌గా సేవలందించారు. కాంగ్రెస్‌పార్టీలో జిల్లాస్థాయి పదవులు పొందారు.
రాజకీయ నేపథ్యం: 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పాలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తర్వాత కొంతకాలానికి బీఆర్ఎస్లో చేరారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామికావడమంటే ఇష్టం. నిరుపేద విద్యార్థుల అభ్యున్నతికి తోడ్పాటునందించడం, వారిని వృద్ధిలోకి తీసుకురావడం ప్రధాన ధ్యేయం.
సత్తుపల్లి
సత్తుపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి : సండ్ర వెంకటవీరయ్య
పుట్టిన తేదీ: 15 ఆగస్టు 1968
జన్మస్థలం: రాజుపేట, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా
తల్లిదండ్రులు: భిక్షం, లక్ష్మమ్మ
భార్య: మహాలక్ష్మి
కుమారులు: భార్గవ్, తేజ
చదువు: డిగ్రీ
రాజకీయ ప్రస్థానం: అత్యంత నిరుపేద కుటుంబంలో పుట్టిన సండ్ర వెంకటవీరయ్య విద్యార్థి దశలోనే సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘమైన ఎస్ఎఫ్ఐకి ప్రాతినిధ్యం వహించారు. ఇదే పార్టీ యువజన సంఘమైన డీవైఎఫ్ఐలో కీలక నేతగా పనిచేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా జిల్లాలో ఆయనకు గుర్తింపు ఉన్నది. 1994లో పాలేరు నుంచి సీపీఎం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అనంతరం సీపీఎంను వీడి టీడీపీలో చేరారు. ఆ పార్టీ నుంచి వరుసగా 2009, 2014, 2018లో ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఈకాలంలోనే రెండుసార్లు తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి సభ్యుడిగా పనిచేశారు. 2018లో ఎమ్మెల్యేగా గెలిచిన కొద్దిరోజులకు బీఆర్ఎస్లో చేరారు. సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారు.
అశ్వారావుపేట
అశ్వారావుపేట బీఆర్ఎస్ అభ్యర్థి: మెచ్చా నాగేశ్వరరావు
పుట్టిన తేదీ: 16 జనవరి 1965
జన్మస్థలం: తాటి సుబ్బన్నగూడెం, దమ్మపేట మండలం
తల్లిదండ్రులు: రాములు, ఆదెమ్మ
భార్య: శ్యామల
కుమారుడు: రాము (దత్తత)
చదువు: ఎస్ఎస్ఎల్సీ
వృత్తి: వ్యవసాయం, రాజకీయాలు
రాజకీయ నేపథ్యం: మెచ్చా నాగేశ్వరరావుది మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం. రాజకీయ రంగంలోకి ప్రవేశించిన తొలినాళ్లలో దమ్మపేట మండలం మొద్దులగూడెం సర్పంచ్‌గా రెండు సార్లు సేవలు అందించారు. తర్వాత టీడీపీ దమ్మపేట మండల తెలుగు యువత అధ్యక్షుడిగా, పార్టీ మండల అధ్యక్షుడిగా, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 2014లో టీడీపీ నుంచి అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి స్వల్పగా మెజార్టీతో ఓడిపోయారు. 2018లో మహా కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీఎం కేసీఆర్ సమర్థ పాలనకు ఆకర్షితులై 7 ఏప్రిల్ 2021న బీఆర్ఎస్లో చేరి నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు.
ఖమ్మం
ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి: పువ్వాడ అజయ్‌కుమార్
పుట్టిన తేదీ: 19 ఏప్రిల్ 1958
జన్మస్థలం: కూనవరం, అల్లూరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
తల్లిదండ్రులు: పువ్వాడ నాగేశ్వరరావు, విజయలక్ష్మి
భార్య: పువ్వాడ వసంతలక్ష్మి
కుమారుడు: నయన్‌రాజ్
విద్యార్హత: అగ్రికల్చర్ ఎమ్మెస్సీ
రాజకీయ నేపథ్యం: తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు సీపీఐ సీనియర్ నాయ కుడు. ఆయన రెండుసార్లు ఎమ్మె ల్యేగా, రెండు సార్లు ఎమ్మెల్సీగా చేశారు. ఆయన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ పువ్వాడ అజయ్‌కుమార్ 2012లో రాజకీయా ల్లోకి వచ్చారు. నాడు వైఎస్సార్ సీపీలో చేశారు. 2012- 13 వరకు వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇదే ఏడాది ఆగస్టులో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం బీఆర్ఎస్లో చేరారు. 2018లో ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం సీఎం కేసీఆర్ క్యాబినెట్లో రాష్ట్రరవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. మంత్రిగా రాజకీయాల్లో తనదైన మార్క్ చూపిస్తూ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ మన్ననలు పొందారు. ఖమ్మం నగరంతోపాటు రఘునాథపాలెం మండలాన్ని అభివృద్ధి బాట పట్టించారు. పార్టీ అధిష్ఠానం తాజాగా ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో స్థానాన్ని సంపాదించారు. ఖమ్మం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
పినపాక
పినపాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి: రేగా కాంతారావు
పుట్టిన తేదీ: 9 ఏప్రిల్ 1977
జన్మస్థలం: కుర్నపల్లి, కరకగూడెం మండలం, భద్రాద్రి జిల్లా
తల్లిదండ్రులు: బొర్రయ్య (లేటు), నర్సమ్మ
భార్య: సుధారాణి (ఉపాధ్యాయురాలు)
కుమారులు: నవదీప్ దొర, హ్యోమచంద్ర దొర
చదువు: బీఏ, యూజీడీ పీ ఈడీ, ఎంఏ పొలిటికల్ సైన్స్
రాజకీయ నేపథ్యం: రేగా కాంతారావు విద్యార్థి దశలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాంగ్రెస్ పార్టీలో చేరి క్రీయాశీలక కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. నాటి ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ చందాలింగయ్య దొర శిష్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 18 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీ యువజన విభాగంలో పనిచేసి తర్వాత పార్టీ కరకగూడెం మండల అధ్యక్షుడిగా కొనసాగారు. 2009లో పినపాక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మహాకూటమి తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతూనే మరోవైపు గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేశారు. 2014లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదు. తర్వాత ఆయన టీపీసీసీ జనరల్ సెక్రటరీగా, పార్టీ వరంగల్ జిల్లా జనరల్ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం కొద్దిరోజులకు బీఆర్ఎస్లో చేరారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆయనకు ప్రభుత్వ విప్‌తోపాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడి పదవులు ఇచ్చారు. అప్పటి నుంచి ఒకవైపు ఎమ్మెల్యేగా కొనసాగుతూనే నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతూ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పనిచేస్తూ, ప్రభుత్వ విప్‌గానూ రేగా సేవలందిస్తున్నారు.
మధిర
మధిర బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి: లింగాల కమల్‌రాజు
పుట్టిన తేదీ:15 జనవరి 1971
జన్మస్థలం : తాటిపూడి శివారు కొస్టాల, వైరా మండలం, ఖమ్మం జిల్లా
తల్లిదండ్రులు: జ్ఞానయ్య, కరుణమ్మ
భార్య: వసంతరాణి(టీచర్)
కుమారుడు, కుమార్తె: అభ్యుదయ్, అభిజ్ఞ
చదువు: ఎంఏ (ఎకనామిక్స్)
రాజకీయ నేపథ్యం: ఎనిమిదో తరగతి చదువుతున్న రోజుల్లోనే కమల్‌రాజు విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు. సీపీఎం అనుబంధ సంఘమైన ఎస్ఎఫ్ఐలో విద్యార్థి నాయకుడిగా పనిచేశారు. సుదీర్ఘకాలం పాటు ఆ పార్టీలో వివిధశాఖల్లో పనిచేశారు. 1995లో సీపీఎం మద్దతుతో వైరా మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికై సేవలందించారు. 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2015లో నాటి వైఎస్సార్ సీపీ నేత, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. 2015 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 5 మే 2016న బీఆర్ఎస్లో చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మధిర బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో జడ్పీటీసీగా గెలిచారు. అనంతరం జడ్పీ చైర్మన్ అయ్యారు. అప్పటి నుంచి జడ్పీచైర్మన్‌గా జిల్లాకు సేవలు అందిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో కమల్‌రాజు స్థానం సంపాదించారు. ఆయన మధిర బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
వైరా
వైరా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి: బానోతు మదన్‌లాల్
పుట్టిన తేదీ: 03 మే 1963
జన్మనస్థలం: ఈర్లపూడి, రఘునాథపాలెం మండలం, ఖమ్మం జిల్లా
తల్లిదండ్రులు: మాన్సింగ్, లక్ష్మీరంగమ్మ
భార్య: మంజుల
కుమారుడు, కుమార్తె: మృగేందర్‌లాల్ (ఐఏఎస్), మనీషాలక్ష్మి (బీటెక్)
చదువు: బీటీ (టీటీసీ)
వృత్తి: ఉపాధ్యాయుడు, రాజకీయాలు
రాజకీయ నేపథ్యం: 1985లో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి విప్లవ రాజకీయాల్లోకి వచ్చారు. న్యూడెమోక్రసీ పార్టీ విద్యార్థి విభాగమైన పీడీఎస్‌యూలో సేవలు అందించారు. తర్వాత ఆ పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీ విద్యార్థి అనుబంధ సంఘంలో పనిచేశారు. 1989, 1993 సంవత్సరాల్లో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా కొలువు సాధించి కూడా రాజకీయాలపై ఆసక్తితో ఉద్యోగంలో చేరలేదు. 1995-1996వ సంవత్సరంలో ఈర్లపూడి ఎంపీటీసీగా గెలుపొందారు. 1996 నుంచి 2001 వరకు, 2006 నుంచి 2011 వరకు ఈర్లపూడి సర్పంచ్‌గా మదన్‌లాల్ పనిచేశారు. 2009లో వైరా నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం వైసీపీలో చేరారు. 2014లో వైరా నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం బీఆర్ఎస్లో చేరారు. 2018లో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. తాజాగా బీఆర్ఎస్ అధిష్ఠానం ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో ఆయన స్థానం పొందారు. ఆయన వైరా నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
భద్రాచలం
భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి: డాక్టర్ తెల్లం వెంకట్రావు
పుట్టిన తేదీ: 25 జనవరి 1970
జన్మస్థలం: చిన్న బం డిరేవు, దుమ్ముగూడెం మండలం, భద్రాద్రి జిల్లా
తల్లిదండ్రులు: బాపపయ్య, జానకమ్మ
భార్య: ప్రవీణ (గృహిణి)
సంతానం: ఇద్దరు అమ్మాయిలు
విద్యార్హత: ఎంబీబీఎస్, ఎంఎస్
రాజకీయ చరిత్ర: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడిగా తొలినాళ్లలో ఉన్న డాక్టర్ తెల్లం వెంకట్రావు 2014లో అధికారికంగా ప్రభుత్వ వైద్య వృత్తికి రాజీనామా చేసి మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం బీఆర్ఎస్లో చేరి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018లో బీఆర్ఎస్ తరఫున భద్రాచలం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత బీఆర్ఎస్లో కొంతకాలం కొనసాగారు. మూడు నెలల క్రితం మాజీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడి నేతల వ్యవహార శైలి నచ్చక ఇటీవల హైదరాబాద్‌లో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో చేరారు. తాజాగా బీఆర్ఎస్ అధిష్ఠానం ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో తెల్లం స్థానం సంపాదించారు. ఆయన భద్రాచలం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.