బీఆర్ఎస్ నేతలపై కేసులు బనాయిస్తూ అక్రమంగా అరెస్టు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తదితర నేతలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అరెస్టులకు నిరసనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, ఇల్లెందు, దుమ్ముగూడెం, చర్ల మండల కేంద్రాల్లో గురువారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ‘కాంగ్రెస్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మణుగూరులో రాస్తారోకో చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
మణుగూరు టౌన్, డిసెంబర్ 5 : మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావును అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపు మేరకు మణుగూరు పట్టణంలోని చౌరస్తాలో ఆ పార్టీ శ్రేణులు గురువారం రాస్తారోకో చేశారు. కాంగ్రెస్ డౌన్ డౌన్, అరెస్ట్ చేసిన హరీశ్‌రావును వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాస్తారోకో చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పోచం నరసారావు, ముత్యం బాబు, వట్టం రాంబాబు, నూకర రమేశ్, దేనికి ప్రసాద్, ముద్దంగుల కృష్ణ, బొలిశెట్టి నవీన్, రవి, రమేశ్, కుంట లక్ష్మణ్, ఎడ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
దమ్మపేట రూరల్, డిసెంబర్ 5 : రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసుల చేత మాజీ మంత్రి హరీశ్‌రావును అక్రమంగా అరెస్టు చేయించడాన్ని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి ఇంటికి వెళ్లిన సమయంలో హరీశ్‌రావును అరెస్టు చేసి తీసుకెళ్లడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనకు అడ్డు తప్పించుకోవాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ శ్రేణులను ఎక్కడికక్కడే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అణచివేత పాలనను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఇల్లెందు, డిసెంబర్ 5 : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఇల్లెందు పట్టణంలోని జగదాంబ సెంటర్ తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సిలివేరి సత్యనారాయణ ఆధ్వర్యంలో పట్టణ, మండల నాయకులు గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల తరఫున పోరాటం చేస్తున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేస్తున్నారనే విషయం తెలుసుకున్న హరీశ్‌రావు అక్కడికి వెళితే అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టడమే పనిగా పెట్టుకుందన్నారు. రాష్ట్రంలో పోలీసు పాలన నడుస్తుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అజ్మీరా బావుసింగ్, ఆదూరి రవి, అబ్దుల్ నబి, రాచపల్లి శ్రీను, వీరస్వామి, జబ్బార్, సర్దార్, మహ్మద్ చాంద్‌పాషా తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం, డిసెంబర్ 5 : ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ.. ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్న మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డిలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మండల కేంద్రమైన లక్ష్మీనగరంలో ప్రధాన రహదారిపై పార్టీ మండల కన్వీనర్ కణితి రాముడు, కో-కన్వీనర్ జానీపాషా ఆధ్వర్యంలో నాయకులతో కలిసి గురువారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా పాలనగా చెప్పుకునే ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులకు ప్రశ్నించే హక్కు లేదా.. అని మండిపడ్డారు. తక్షణమే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు దామెర్ల శ్రీనివాస్, జుంజూరి జయసింహ, తంతరపల్లి వెంకటేశ్వర్లు, మర్మం గంగరాజు, కుమ్మరికుంట సూర్య, కణితి లక్ష్మణ్, జిలకర గంగరాజు, వాడే కృష్ణ, మాజీ సర్పంచ్ పొడియం రామయ్య, ఉమ్మినేని నాగరాజు, మాజీ ఎంపీటీసీ మడకం రామారావు, ఉబ్బా నర్సింహారావు, తుర్రం రాజేశ్ పాల్గొన్నారు.
చర్ల, డిసెంబర్ 5 : బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డిల అక్రమ అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ నాయకులు చర్ల మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో గురువారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే గొంతును నులిమే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేసే క్రమంలో పలకరించేందుకు వెళ్లిన హరీశ్‌రావును అరెస్ట్ చేయడం అమానుషమన్నారు. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పంజా రాజు, కాకి అనిల్, గోరంట్ల వెంకటేశ్వరరావు, కారం కన్నయ్య, విజయారావు, గాదంశెట్టి కిశోర్ తదితరులు పాల్గొన్నారు.